పవన్ కల్యాణ్ ప్రస్తావన దాదాపుగా ప్రతీ సినిమాలోనూ షరా మామూలుగానే కనిపిస్తోంది. హీరోనో, హీరోయినో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌గా సృష్టిస్తుంటారు దర్శక రచయితలు. దాంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ని ఆకర్షించేందుకు మార్గం సుగమం అవుతుంటుంది. సరిగ్గా ఇదే స్ట్రాటజీ గురు సినిమాలోనూ ఫాలో అయిపోయార్ట. ఈ సినిమాలో కథానాయిక రితికా సింగ్ ని పవన్ కల్యాణ్‌కి వీరాభిమానిగా చూపించబోతున్నారు. ట్రైలర్ లోనూ అందుకు సంబంధించిన షాట్స్ కొన్ని కనిపించాయి. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ కటౌట్… ఓ షాట్లో దర్శనమిచ్చింది. పవన్ కల్యాణ్ వాడే ఎర్ర కండువాని హీరోయిన్ తలకు చుట్టుకొంటున్న దృశ్యం కూడా గురు ట్రైలర్లో చూడొచ్చు. పవన్ కల్యాణ్‌కి సంబంధించిన డైలాగులు కూడా గురు సినిమాలో వినిపించనున్నాయని టాక్. అలా.. ఈ సినిమాలోనూ పవన్‌ని పూర్తి స్థాయిలో వాడేశారన్నది స్పష్టం అవుతోంది.
ఈ విషయాన్ని పక్కన పెడితే… వెంకీకి సంబంధించినంత వరకూ గురు ఓ ప్రత్యేక చిత్రంగా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే… ఇది వరకెప్పుడూ కనిపించని లుక్‌లో వెంకీ దర్శనమిస్తున్నాడు. తన డైలాగ్ డెలివరీ కూడా పూర్తిగా మారిపోయింది. అందుకే వెంకటేష్ కూడా ”నా ముఫ్ఫై ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదు. నాకే చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకూ నా నుంచి వచ్చిన సినిమాలు వేరు. గురు వేరు. ఇక ముందు కూడా వెరైటీ పాత్రలతోనే మీ ముందుకొస్తా” అని మాట ఇస్తున్నాడు. మరి గురు వెంకీని ఎంత వరకూ మార్చిందో తెలియాలంటే ఏప్రిల్ 7 వరకూ ఆగాల్సిందే.