2018సంవత్సరంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామంలోకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంటరయ్యారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తాడిపత్రి నియోజకవర్గంలో ఉండదు. రిజర్వుడు నియోజకవర్గమైన శింగనమలలో ఉంటుంది. ఆ గ్రామంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఇల్లు కొన్నారు.అట్ట హాసంగా గృహప్రవేశం చేశారు. ఆ సమయంలో.. పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు ప్రభుత్వ టీడీపీది. ఎమ్మెల్యేగా ఉన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో పెద్దారెడ్డి ఏం చేయలేకపోయారు. ఇప్పుడు.. ప్రభుత్వం మారింది. నువ్వు నా స్వగ్రామంకి వస్తే.. నేను నీ ఇంట్లోకి రాలేనా అన్నట్లుగా పెద్దారెడ్డి చెలరేగిపోయారు. జేసీ ఇంట్లోకి వెళ్లి వీరంగం సృష్టించారు. ఇప్పుడు అధికారం పెద్దారెడ్డి చేతిలో ఉంది. దాంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేయలేకపోయారు.
నిజానికి కేతిరెడ్డి, జేసీ వర్గాల మధ్య వర్గ పోరాటం.. ఫ్యాక్షన్ పోరాటం ఇప్పటిది కాదు. కేతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరీడు అనే నేత ఉండేవారు. ఆయన కూడా కాంగ్రెస్‌లోనే ఉండేవారు. ధర్మవరం వేదికగా ఆయన రాజకీయం చేసేవారు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ రాజకీయం చేసేది. రెండు వర్గాల మధ్య ప్యాక్షన్ గొడవలు ఏళ్ల తరబడి నడిచాయి. చివరికి తాడిపత్రి రైల్వేస్టేషన్ వద్ద కేతిరెడ్డి సూరీడుహత్యకు గురయ్యాడు. అప్పట్లో సీఎంగా ఉన్న వైఎస్ జేసీ, కేతిరెడ్డి వర్గాల మధ్య రాజీ చేశారు. కేతిరెడ్డి కుటుంబాని దర్మవరం… జేసీ కుటుంబానికి తాడిపత్రి ఇచ్చి.. ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు వేలు పెట్టకుండా ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత జేసీ టీడీపీలో చేరడంతో ఒప్పందాన్ని కేతిరెడ్డి వర్గీయులు ఉల్లంఘించడం ప్రారంభించారు.
వైసీపీ అధినేత జగన్… రాజకీయాలకు దూరంగా ఉన్న కేతిరెడ్డి సూరీడు సోదరుడు పెద్దారెడ్డిని తాడిపత్రికి ఇంచార్జ్ గా పంపారు. సూరీడు కొడుకు వెంకట్రామిరెడ్డికి ధర్మవరం కేటాయించారు. అప్పట్నుంచి మళ్లీ రెండు వర్గాల మధ్య పోరాటం ప్రారంభమయింది. జేసీ అధికారంలో ఉన్నప్పుడు. ఫ్యాక్షన్ ప్రభావం పడలేదు. కానీ… ఇప్పుడు పాత కక్షలతో… నట్టింట్లోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇంత జరిగిన తర్వాత ప్రత్యర్థులు ఊరుకునే అవకాశం లేదు. పెద్దారెడ్డి కూర్చున్న కుర్చీనే తగులబెట్టారంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు వర్గాల మధ్య ప్యాక్షన్ మళ్లీ పడగ విప్పుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.