వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వలసలురావడం మొదలైన తర్వాత.. నష్టం వైకాపాకే జరుగుతుందని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ.. వాస్తవంలో తెలుగుదేశం పార్టీకి కూడా సమానమైన నష్టం తప్పదా? అనే అనుమానం ఇప్పుడు పార్టీ వర్గాల్లో కలుగుతోంది. కొత్తనీరు వచ్చే కొద్దీ.. పాతనీరు వెళ్లిపోవాల్సిందేనా? తెలుగుదేశం పార్టీలో కూడా అలాంటి పరిస్థితులే సృష్టింపబడుతున్నాయా? కొత్త చేరికల వలన పాత నాయకులు పార్టీ పట్ల విముఖత పెంచుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతానికి భూమా నాగిరెడ్డి పేరుతో ముడిపడి ముసలం పుట్టినట్లుగా కనిపిస్తోంది.
జిల్లా పార్టీకి సారథ్యం వహిస్తున్న శిల్పా మోహన్‌రెడ్డి సోదరులకు, భూమా నాగిరెడ్డికి మధ్య చిరకాల వైరం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భూమా తెదేపాలో చేరడానికి నిర్ణయించుకున్నప్పుడు కూడా శిల్లా సోదరులు దానిని తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. తమకు చేతనైనంత అడ్డుపడడానికి ప్రయత్నించారు. అప్పట్లో చంద్రబాబు సర్ది చెప్పడంతో… పార్టీకోసం అంటూ మిన్నకుండిపోయారు. ఇప్పుడు తెదేపాలోని నాయకుల మీదనే దాడులు జరుగుతుండడంతో అవి భూమా పనే అంటూ ఆరోపణలు రేగడం.. జిల్లా రాజకీయాల్లో వైషమ్యాలను ప్రతిబింబిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. శిల్పాసోదరుల కీలక అనుచరుల్లో ఒకరైన తులసిరెడ్డి అనే సర్పంచిపై దాడి జరిగింది. ఆయనను తీవ్రంగా కొట్టడంతో ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఈ దాడి భూమా నాగిరెడ్డి చేయించారని, తెలుగుదేశం పార్టీలో చేరినప్పటినుంచి భూమా నాగిరెడ్డి ఆగడాలను భరించలేకపోతున్నాం అని, ఇసు మాఫియా తదితర దందాలలో ఆయన జోక్యం శృతిమించిపోతున్నదని శిల్పా సోదరులు సీఎం చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు. భూమా పార్టీలోకి రాకముందు కూడా చంద్రబాబుకు ఆయన దందాల గురించి చెప్పామని, అంతా సర్దుకుంటాయని అనడంతో ఊరుకున్నామని.. ఇప్పుడు తమ అనుచరుల మీద భూమానే దాడి చేయించారని శిల్పాసోదరులు చంద్రబాబును కలిసిన తర్వాత.. మీడియాతో అంటున్నారు.
అదే సమయంలో భూమానాగిరెడ్డి వాదన మరో తీరుగా ఉంది. సర్పంచి తులసిరెడ్డి గ్రామంలో పంచాయతీలు చేస్తుంటారని.. స్థానిక కక్షల పర్యవసానంగా ఆయన మీద దాడి జరిగి ఉండవచ్చునని అంటున్నారు. అంతే తప్ప.. ఆ దాడితో తనకు సంబంధం లేదని అంటున్నారు. దాడికి గురైన వ్యక్తి గ్రామ కక్షల వలన దాడి జరిగినట్లు చెబుతోంటే.. శిల్పా మాత్రం పనిగట్టుకుని తన మీదకు ఆరోపణల్ని మళ్లిస్తున్నారని భూమా అనడం విశేషం. శిల్పా మోహన్‌రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా ఇసుక మాఫియాతో తనకు సంబంధం ఉన్నట్లుగా నిరూపిస్తే గనుక.. రాజకీయాలనుంచే శాశ్వతంగా తప్పుకుంటానంటూ భూమా నాగిరెడ్డి సవాలు చేయడం విశేషం. తన తరఫునుంచి తప్పు జరగలేదు గనుక.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసే అవసరం కూడా లేదని భూమా అంటున్నారు. సరిగ్గా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే… పార్టీ ముఠా కుమ్ములాటలు ఇంత తీవ్రస్థాయిలో బయటపడడం గమనార్హం.