కృష్ణా గోదావరి నదుల అనుసంధానంకోసం తరుముకొచ్చినంత తొందరగా చేపట్టిన పనుల్లో అప్పుడే ఒకనిర్మాణం కూలిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిమండలం జానంపేట దగ్గర తమ్మిలేరు వాగుమీద పట్టిసీమ నీరు ప్రవహించడానికి నాలుగుకోట్ల రూపాయలు ఖర్చుతో ఆ ఆక్విడక్టు కట్టారు.
పట్టిసీమ ఎత్తిపొతల పధకానికి 24 పంపులు పనిచేయాలి పంపుల సరఫరాలో ఆలస్యమవడం వల్ల తెలుగుదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నదీ అనుసంధాన కార్యక్రమం నాలుగుసార్లు జరిగింది. 1)నీరువిడుదలకాకమునుపే ముఖ్యమంత్రి ఈ పధకాన్ని జాతికి అంకితం చేశారు. 2)పట్టిసీమనుంచి గోదావరినీటికి బదులు తాడిపూడి ప్రాజెక్టుకి వాగులు వంకల నుంచి వచ్చేనీటిని పోలవరం కుడికాల్వలో కలిపి కష్ణానదిలోకి మళ్ళించిన కార్య్రమానికి కృష్ణ్ణానది వద్ద ముఖ్యమంత్రి ప్రారంభించారు. 3) ఇరవైనాలుగు పంపులకు గాను బిగించిన ఏకైక పంపు పని ముఖ్యమంత్రి వచ్చిన సమయానికి పూర్తికాకపోవడంతో ఓ కొబ్బరికాయకొట్టి వెళ్ళిపోయారు 4) మరుసటిరోజు జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక్కగానొక్క ఆ పంపుని స్విచ్ఛాన్ చేసి ప్రారంభించారు.
ఇది జరిగిన మరుసటిరోజే ఆక్విడక్టు కూలిపోయి, కృష్ణానదిలోకి వెళ్ళవలసిన తాడిపూడి నీరూ, కొద్దిపాటి గోదావరినీరూ తమ్మిలేరులో కలసిపోయింది. శనివారం రాత్రి ఈ సంఘటన జరగడంతో కుడికాలువకు గండిపడిందని భావించారు. ఆదివారం ఉద యం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అక్విడెక్టు జాయింట్ కూలిన వైనం బయటపడింది.ఫలితంగా పట్టిసీమ మొదటిపంపు, తాడిపూడి నీటి పంపింగ్‌ను నిలిపివేశారు. ఆవిధంగా నదీ అనుసంధానం 24 గంటలకే ఆగిపోయింది.
కుడికాలువ సామర్థ్యం 7,500 క్యూసెక్కులు. ప్రస్తుతం తాడిపూడి నుంచి నుంచి 500 క్యూసెక్కుల వరకూ నీరు మాత్రమే విడుదలవుతోంది. ఇక పట్టిసీమ నీరు పూర్తిస్థాయిలో చేరుకోలేదు. ఈ కొద్దిపాటి నీటికే అక్విడెక్టు కూలిపోతే, భవిష్యత్తులో పూర్తిస్థాయిలో నీళ్లు వస్తే పరిస్థితి ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
తమ్మిలేరుపై నిర్మించిన అక్విడెక్టు వీటిలో అతిపెద్దది. కుడికాలువ పొడవునా 41 రోడ్డు క్రాసింగ్‌లు ఉన్నాయి. ఇక్కడ వంతెనలు నిర్మించాల్సి ఉంది. అయితే తాత్కాలిక పద్ధతిలో తూములు పెట్టి వాహనాలు వెళ్లేవిధంగా చేశారు. రోడ్డు క్రాసింగ్‌లన్నీ తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించడంతో వాహనాలు వెళ్లేటప్పుడు ఒక్కసారిగి కిందకు పడిపోయే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏడాదిలోకావలసిన పనులను ఆరునెలలలోనే గొంతు మీద కూర్చుని పూర్తి చేయించిన అనర్ధమే ఇదని జలవనరులశాఖలో సిబ్బందిని ఎవరిని కదిలించినా తిట్టుకుంటున్నారు.