బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ … జనసేన చీఫ్‌కు రూ. వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆఫర్ చేశారని గత వారం కొత్త పలుకులో ఆర్కే రాసిన విషయం దుమారం రేపింది. ఈ అంశంపై ఆయన ఈ వారం జనసైనికులకు పద్దతిగా క్లాస్ తీసుకున్నారు. అసలు తాను రాసిన దాంట్లో జనసైనికులు రచ్చ చేయాల్సినంత ఏముందో మరోసారి చదివి చూసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. కేసీఆర్ … తన ప్రతినిధుల్ని పవన్ వద్దకు పంపారన్న విషయాన్ని తాను చెప్పానని అది నిజం కాకపోతే.. కేసీఆర్ చెప్పాలి కనీ జనసైనికులకు ఎందుకు నొప్పి పుట్టిందని ఆర్కే తన ఆర్టికల్‌లో సూటిగానే ప్రశ్నించారు.
అసలు కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని చెప్పాను కానీ ఎక్కడైనా పవన్ కల్యాణ్ ఒప్పుకున్నారని చెప్పానా… అని ఆర్కే గట్టిగానే అడిగారు. పనిలో పనిగా జనసైనికుల అభిప్రాయాల్లాగే వ్యక్తం చేస్తూ లేఖ రాసిన నాగబాబుకూ పేరు పెట్టకుండా మెగా సోదరుల పేరుతో క్లాస్ పీకారు ఆలోచన లేకుండా ఆవేశ పడితే ఏం జరుగుతుందో చెప్పారు. అసలు తాను రాసిన దాంట్లో తప్పేమి ఉందో చెప్పాలని.. గతంలో తాను చెప్పిన విషయాలపై మొదట్లో గగ్గోలు రేగినా నిజమైందన్న విషయాన్ని ఆయన సాక్ష్యాలుగా ప్రకటించుకున్నారు.
బీఆర్ఎస్ తో పవన్ కల్యాణ్ వెళ్తారని … వారిచ్చే ఆర్థిక సాయం తీసుకుంటారని ఆర్కే కూడా చెప్పలేదు. కానీ కేసీఆర్ మాత్రం పవన్ కల్యాణ్ ను ఒంటరి పోరాటం చేయించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారనేది తెలంగాణ రాజకీయవర్గాల్లో విస్తృతంగా ఉన్న చర్చ. దాన్ని ఆర్కే బహిరంగం చేశారు. అదే సమయంలో తెలంగాణలో మున్నూరు కాపు వర్గం బీజేపీ, కాంగ్రెస్‌తో ఉంది. ఆ వర్గంలో కొంత వరకైనా పవన్ ద్వారా వెనక్కి తెచ్చుకుందామని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అది కూడా ఓ కారణం. ఈ విషయాన్ని ఆర్కే గత వారమే చెప్పారు. ఇలాంటివన్నీ జనసైనికులు పరగిణనలోకి తీసుకోకుండా ఆర్కేపై విరుచుకుపడ్డారు.
అసలు రాజకీయ పొత్తులు పెట్టుకుంటే మాకేంటి.. పెట్టుకోకపోతే మాకేంటి.. పొత్తులు కుదర్చడమే మా పనా అని ఆర్కే ప్రశ్నించారు. రాజకీయాల్లో పొత్తులు ఒకరికి లాభం చేకూర్చడానికి ఉండవు. ఇరు పార్టీలకు ఉపయోగమైతేనే ఉంటాయి. మొత్తంగా ఆర్కే .. జనసైనికులకు ఈ వారం గట్టి క్లాస్ పీకారు. దీనిపైనా వారు ఎలా స్పందిస్తారో కానీ.. ఇప్పటికే అసలు ఏమీ లేకపోయినా ప్యాకేజీ తీసేసుకున్నారన్నట్లుగా జనసైనికులు హడావుడి చేయడంతో వారి ఆలోచన స్థాయి తక్కువని.. ఆర్కే నిరూపించడానికి ఈ వారం ఆర్టికల్ ను బాగానే ఉపయోగించుకున్నారు.