విలక్షణ రాజకీయ వ్యాసాలకు పెట్టింది పేరు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ.. రోజు మార్చి రోజు.. ప్రధానమంత్రిని కలవడంపై తన వారాంతపు ఆర్టికల్ ” కొత్తపలుకు “లో నిశితమైన విశ్లేషణ చేశారు. వీరిద్దరూ… కూడబలుక్కున్నట్లుగా.. బయట ప్రచారం జరిగినట్లుగా.. కేంద్రంపై యుద్ధానికి వెళ్లడం లేదని.. ఇద్దరూ కలిసి… కేంద్ర ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. కేసీఆర్ అటు అమిత్ షా, ఇటు మోడీతో భేటీ సమయంలో.. తనను శత్రువుగా పరిగణించవద్దని కోరినట్లుగా.. ఆర్కే విశ్లేషించారు. అయితే… వారు అలా కోరినంత మాత్రాన… మోడీ, అమిత్ షాలు తగ్గే అవకాశం లేదని కూడా చెప్పుకొచ్చారు.
కేసీఆర్ గత ఎన్నికల్లో… భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చాలా పెద్ద తతంతగమే నడిపారని బీజేపీ అగ్రనేతలు నమ్ముతున్నారట. పలు రాష్ట్రాల్లో పార్టీలకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం పంపిణీ చేశారట. ” “తెలంగాణలలో ఏమి జరుగుతోంది? అంత చిన్న రాష్ట్రంలో అంత డబ్బు ఎక్కడిది?” అని నేరుగానే అమిత్ షా ఆరాతీయడం మొదలుపెట్టారంటున్నారు. వరుసగా బీజేపీలో చేరుతున్న కాంగ్రెస్ నేతలకు కూడా అమిత్ షా… కేసీఆర్ మన శత్రువు.. ఎప్పటికీ ఆయనకు దగ్గరయ్యే అవకాశమే లేదని.. తేల్చి చెప్పారని.. ఆర్కే వివరించారు. దానికి ప్రస్తుత రాజకీయ పరిణామాలను జత కలిపారు. బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ పై చేస్తున్న రాజకీయ దాడులతో.. ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న విధానాన్ని ఆర్కే వివరించారు. అదే సమయంలో తెలంగాణలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం.. ప్రజలల్లో పెరుగుతున్న అసంతృప్తి… హుజూర్‌నగర్‌లో పరిస్థితి ఏమంత తేలికగా లేదని… సీపీఐ మద్దతు కోరడం ద్వారా.. కేసీఆరే బయట పెట్టుకున్న వైనం… లాజికల్‌గా ఆర్కే వివరించారు.
గతంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆంధ్రజ్యోతి ఆర్కే.. ఇప్పుడు మాత్రం… సహాయ, పునరావాస ఖర్చు భరించాల్సి వస్తుందన్న కారణంగా వెనక్కి తగ్గతున్నట్లు చెబుతున్నారు. రూ. 30వేల కోట్లు ఖర్చయ్యే సహాయ పునరావాసం బాధ్యత కేంద్రం తీసుకునే పరిస్థితి లేదని తేల్చేశారంటున్నారు. కేంద్రమే భరించలేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా భరించగలుగుతుంది..? ఈ సందేశాన్ని ఆర్కే నేరుగా వెల్లడించకపోయినప్పటికీ.. పోలవరం ప్రాజెక్ట్ ఇక ముందుకు సాగదన్న రీతిలో… ఆర్కే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. అందరికీ అదే అనిపిస్తోంది. అదే సమయంలో.. చంద్రబాబును కేసుల్లో ఇరికిస్తానని.. జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి మాట ఇచ్చారట. నాలుగు నెలల్లో ఒక్క అవినీతిని బయట పెట్టకపోవడంతో… బీజేపీ అగ్రనాయకత్వం అసంతృప్తిలో ఉందంటున్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మొదట్లో నివేదిక ఇచ్చినా.. అసలు విచారణలో అలాంటిదేమీ లేదని తేలడంతో.. సైలెంటయ్యారని చెబుతున్నారు. మొత్తానికి ఆర్కే.. బీజేపీ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులకు చేతులు కాలిపోయాయని.. ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదని చెప్పుకొచ్చారు.. !