బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రెడీ అయ్యారు. ఆయన అంతటకు ఆయనే బీజేపీకి ప్రతిపాదనలు పంపారు. ఎలాంటి షరతులు లేకుండా కూటమిలో చేరుతాననే సందేశం పంపారు. బీఆర్ఎస్ వైపు నుంచే బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నామన్న లీకులు ఇచ్చారు. కానీ బీజేపీ మాత్రం.. బీఆర్ఎస్ ను లైట్ తీసుకుంది. పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని చెబుతోంది…. ఈ విషయాలన్నీ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తన వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో స్పష్టం చేశారు. కేసీఆర్ మొదట్లో బీజేపీతో పొత్తు కోసం రెడీగా లేనప్పటికీ… రేవంత్ దూకుడుతో భయం పట్టుకుందని.. పార్టీ సగం కుంచించుకుపోయినా సరే.. బీజేపీతో పొత్తుకు వెళ్లాలని డిసైడయ్యారని అంటున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒకటి, రెండు సీట్లే పరిమితమైతే తర్వాత ఎలాంటి ప రిస్థితి ఉంటుందో… రాజకీయాల్లో పీహెచ్డీ చేసిన కేసీఆర్ కు తెలియనిదేం కాదు. అందుకే ఆయన అసలు పార్టీ లేకపోవడం కన్నా… సగం పార్టీ అయినా ఉండటం మంచిదని అనుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందన్న క్లారిటీ ఉండటంతో ఆ పార్టీనే కరెక్ట్ అని.. పొత్తులకు రాయబారం పంపుతున్నట్లుగా చెబుతున్నారు. దీనికి కుటుంబసభ్యుల మద్దతు కూడా ఉందన్నది ఆర్కే భావన.
అయితే బీజేపీ ఖరాఖండిగా తేల్చి చెప్పలేదని.. రాష్ట్ర బీజేపీ నేతల్లో ఒకరిద్దరు మినహా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని ఆర్కే చెబుతున్నారు. కిషన్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు ఇంకా చేయనప్పటికీ బండి సంజయ్ మాత్రం మెడ మీద తలకాయ ఉన్న వారు ఎవరూ పొత్తులకు ఒప్పుకోరని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఓ రకంగా బీఆర్ఎస్ కొనఊపిరితో ఉందని.. తాము ఎందుకు బతికించాలన్నది బండి సంజయ్ మాటల్లోని అర్థం. అయితే ఢిల్లీ నేతలు ఏం ఆలోచిస్తారో తెలియదు కానీ.. రాష్ట్ర నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
ఆర్కే కూడా బీజేపీ వంద శాతం ఖండించలేదని.. వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాల్సి ఉందంటున్నారు. రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుని ఎక్కువ సీట్లు గెల్చుకుంటే.. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చవచ్చన్న డీల్ సెట్ చేసుకోచ్చన్న అనుమానాలను ఆర్కే పరోక్షంగా వ్యక్తం చేశారు. మొత్తంగా కేసీఆర్ తెలంగాణలో రేవంత్ చేతికి చిక్కడం కన్నా.. బీజేపీ చేతికి చిక్కాలనే డిసైడయినట్లుగా ఆర్కే తెలుస్తున్నారు.