ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం “కొత్త పలుకు”లో ముందస్తు ఎన్నికల హింట్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్న చర్యలను విశ్లేషించి ఇవన్నీ ముందస్తు అడుగులేనని చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో చాలా స్పష్టత గా ఉన్నారన్నట్లుగా ఆర్కే చెబుతున్నారు. బీజేపీ కన్నా తనకు రేవంత్ రెడ్డితోనే ఎక్కువగా రాజకీయ ముప్పు ఉందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్లుగా ఆర్కే చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ వారం రోజుల పాటు ఢిల్లీలో ఉండి చేసిన ముఖ్యమైన పని రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో శిక్ష పడేలా సహకరించాలని కేంద్ర పెద్దలను కోరడమట.
అదే సమయంలో కేసీఆర్ బీజేపీ పెద్దలతో సన్నిహితండంగా ఉండేందుకు ప్రయత్నించడానికి కారణం కూడా ముందస్తు ఎన్నికల్లో ఒకటని చెబుతున్నారు. ఆయన ముందస్తుకు వెళ్లాలంటే ఖచ్చితంగా కేంద్రం సహకారం ఉండాలి. తొందరపడి అసెంబ్లీని రద్దు చేస్తే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో బీజేపీకి కూడా రేవంత్ రెడ్డి తెలంగాణలో గడ్డు పరిస్థితి తీసుకు వస్తున్నారని ఆయనకు శిక్ష పడితేనే పరిస్థితి మారుతుందని కేసీఆర్ చెప్పారని అంటున్నారు. ఈ విషయంలో ఏమైనా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటే తెలంగాణ రాజకీయాలు మారిపోతాయని ఆర్కే చెప్పుకొచ్చారు.
ఇక ఈ వారం ఏపీ రాజకీయాలకూ తగినంత ప్రాధాన్యం కల్పించారు. ఇటీవలి కాలంలో సీఎం జగన్పై ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పడానికి ప్రతి వారం కొంత సమయం కేటాయిస్తున్నారు. మధ్యతరగతి జీవుల్లో ప్రభుత్వంపై పట్టరానంత కోపం ఉందని ఆర్కే చెబుతున్నారు. ఈ విషయాన్ని జగన్ కూడా గుర్తించారని అందుకే ఆయనలో పట్టరానంత అసహనం పెరిగిపోతోందన్న అభిప్రాయం వెలిబుచ్చారు. పీకే వస్తాడని జగన్ కేబినెట్ సమావేశంలో మంత్రులతో చేసిన వ్యాఖ్యలను కూడా ఆర్కే మరో రకంగా విశ్లేషించారు. పీకే టీం ప్రజా వ్యతిరేకత ఉందని తేల్చితే జగన్ కూడా ముందస్తుకు వెళ్తారని ఆర్కే నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అధికారులు ప్రభుత్వం మారితే ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారో కూడా చూచాయగా చెప్పడానికి ఇటీవలి కాలంలో ఆర్కే ప్రయత్నిస్తున్నారు. ఈ వారం కూడా ఓ పేరా దాని కోసం కేటాయించారు. అడ్డగోలు నిర్ణయాల్లో భాగమైనవారిపై తర్వాత అయినా విచారణ జరగకపోదని ఆయన అంటున్నారు. డీజీపీ గౌతం సవాంగ్ ఇంత నిస్సహాయుడిగా మారిపోవడాన్ని ఊహించలేకపోయానని ఆయనపై సానుభూతి వ్యక్తం చేశారు. మొత్తానికి ఆర్కే తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడానికి ముందస్తు ఎన్నికలే మార్గమని భావిస్తున్నాయన్న అంశాన్ని ఆర్కే ఈ వారం కొత్త పలుకులో నేరుగానే చెప్పారు.