ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ… ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉద్యమంలా చేస్తున్న ప్రైవేటీకరణ అంశంపై కొత్త కోణం బయట పెట్టారు. తన వారంతపు ఆర్టికల్ కొత్తపలుకులో ఆయన ప్రైవేటీకరణ చేస్తున్నది రిజర్వేషన్లు ఎత్తివేయడానికేనని విశ్లేషించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో.. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ప్రైవేటీకరణ అయితే రిజర్వేషన్లు అమలు చేయాల్సిన పని లేదు. అందుకే… అత్యధిక పీఎస్‌యూలు కూడా అమ్ముతున్నారని.. చివరికి బ్యాంకుల్ని కూడా అమ్ముతున్నారని ఆర్కే అంటున్నారు. ఈ ప్రకారం చూస్తే… బడుగు బలహీనవర్గాలకు రిజర్వేషన్లు ముందు ముందు ఉండవని ఆయన తేల్చేస్తున్నారు.
నిజానికి బీజేపీ ప్రభుత్వంలో రిజర్వేషన్లపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. యూపీకి చెందిన ఓ బీజేపీ ఎంపీ ..రిజర్వేషన్లు తీసేసుందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించి పార్టీ నుంచి వెళ్లిపోయారు. కొన్ని ఉద్యమాలు కూడా జరిగాయి. అయితే రిజర్వేషన్లు తీసేసే ప్రశ్నే లేదని అమిత్ షా లాంటి వారు ప్రకటించడంతో సద్దుమణిగాయి. అయితే రిజర్వేషన్లు తీసేయడం లేదు కానీ రిజర్వేషన్లు కల్పించాల్సిన సంస్థలను మాత్రం తీసేస్తున్నారు. దీంతో… వారికి వచ్చే అవకాశాలకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలను ఆర్కే వ్యక్తం చేస్తున్నారు.
ఆర్కే తన కొత్త పలుకులో అమరావతి జేఏసీకి చెందిన శ్రీనివాసరావు… ఏబీఎన్ స్టూడియోలో ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టిన అంశంపై ఎక్కువ సమయం కేటాయించారు. వారిద్దరి మధ్య రాజీకి ప్రయత్నించానని… శ్రీనివాసరావు ఒప్పుకున్నా… విష్ణువర్ధన్ రెడ్డి ఒప్పుకోలేదని బయట పెట్టారు. అంతటితో వదిలి పెట్టలేదు. నలుగురు బీజేపీ నేతలు జగన్ ప్రయోజనాల కోసం ఎలా పని చేస్తున్నారో విశదీకరించేప్రయత్నం చేశారు. ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నామని బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన ప్రకటనను ఆర్కే ఎగతాళి చేశారు. అదే సమయంలో కన్నా లక్ష్మినారాయణ .. తన ప్రెస్‌మీట్‌కు ఆంధ్రజ్యోతిని పిలవడాన్ని గుర్తు చేసి… సోము వీర్రాజుకు పార్టీలో ఏ మాత్రం పలుకుబడి లేదని తేల్చేశారు. జగన్,చంద్రబాబు మోడీకి భయపడతారేమో కానీ తాను భయపడబోనని కూడా.. సోము వీర్రాజు మొహం మీదనే చెప్పేశారు.
ఆర్కే కొత్త పలుకు రాజకీయంగా ఆసక్తికరమైన మలుపులను బయట పెడుతూ ఉంటుంది. ఏబీఎన్ స్టూడియోలో చెప్పు అంశంపై ఈ వారం ఇచ్చిన వివరణ.. బీజేపీ నేతలకు ఉద్దశాలు ఆపాదించడం వరకూ రాజకీయంగానే కనిపిస్తున్నా… రిజర్వేషన్ల విషయంలో… ఎస్సీ, ఎస్టీ, బీసీల మదిలో ఓ అనుమాన బీజాన్ని నాటడంలో మాత్రం సక్సెస్ అయినట్లుగా కనిపిస్తోంది. రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలోనే అమలు చేస్తారు. ప్రభుత్వరంగ సంస్థలేవీ ఇక ఉండవని మోడీ చెబుతున్నప్పుడు… రిజర్వేషన్ ఫలాలు ఇక అందుకునే చాన్స్ ఉండదు. ఉద్యోగాల భర్తీఅంతంతమాత్రంగా ప్రభుత్వ సర్వీసుల్లో మాత్రమే అరకొర అవకాశాలు లభిస్తాయి.ఈ విషయంలో ఆర్కేమాటలు లాజికల్‌గానే ఉన్నాయి.