‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఈ కార్యక్రమం గురించి పరిచయం అక్కర్లేదు. సంఘంలోని ప్రముఖులు, సెలబ్రెటీల అంతరంగంను తనదైన శైలిలో ఆవిష్కరిస్తుంటారు ఆంధ్రజ్యోతి కం ఏబీఎన్ రాధకృష్ణ. ప్రశ్నలు అడగడంలో ఆయనది డిఫరెంట్ స్టయిల్. చాలా మాటల్లో హేళన ధ్వనిస్తుంటుంది. ముఖ్యంగా సినిమా వాళ్ళను ఇంటర్వ్యూ చేసినప్పుడు .. శ్లేషాలు, ద్వంద అర్ధాలు, తిక్క ప్రశ్నలు, వెకిలి నవ్వులు.. ఇలా తనకు నచ్చినట్లు ప్రోగమ్ చేసుకోవడం ఆయన స్టయిల్. అంతేకాదు ఎంత మంచి విషయమైన గడ్డిపరకలా తీసిపారేస్తుంటారు. దీనిపై ఇప్పటికే బోలెడు సెటైర్లు వున్నాయి. యుట్యూబ్ లో ఆర్క్ స్పూపులు అని కొడితే వందల వీడియోలు వస్తాయి.
తాజాగా దర్శకుడు మారుతి ఈ షోకి వెళ్ళాడు. ఈ ఇంటర్వ్యూ లో రమ్యకృష్ణ ప్రస్తావన వచ్చింది.” బాహుబలి వరకూ రమ్యకృష్ణ అంటే గ్లామర్ డాల్ కదా. అసలు ఆమెకు అంత నటన వచ్చని ఎవరి తెలుసు? రాజమౌళి ఆ పాత్ర తీయడం బట్టే ఆమె నటన వెలుగులోకి వచ్చింది” ఇదీ రమ్యకృష్ణపై ఆర్కే కామెంట్. నిజంగా భయంకరమైన సినిమా అజ్ఞానం ఇది. బాహుబలిలో శివగామి పాత్ర రమ్యకృష్ణ కెరీర్ లో ఓ మైలురాయి. ఇది ఎవరూ కాదనలేరు. అయితే బాహుబలి వరకూ ఆమెలో నటన బయటకి రాలేదు, ఆమె ఒక గ్లామర్ డాల్ అని చెప్పడం మాత్రం నిజంగా సినిమా అజ్ఞానమే.
ఒక్కసారి రజనీకాంత్ ‘నరసింహ’ సినిమా గుర్తుకుతెచ్చుకోవాలి. ఆ సినిమా అంతలా హిట్ అవ్వడానికి కారణం నీలాంబరి పాత్ర. ఆ పాత్రలో రమ్యకృష్ణ నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. రజనీకాంత్ ఎదురుగా నిలబడాలంటే దమ్మున్న, కండలు తిరిగిన ఓ భారీ విలన్ ఉండాల్సిందే. అయితే ఈ సినిమాతో ఆ లెక్క మారిపోయింది. లేడి విలన్ గా రజనీతో పోటిపడి మరీ నటించి రమ్య. ఆ సినిమాని గుర్తు చేసుకున్నప్పుడల్లా రజనీ ఎంతలా గుర్తుకువస్తాడో రమ్యకృష్ణ కూడా అంతేస్థాయిలో ప్రేక్షకుల కళ్ళముందు కదులుతుంది. అదే కాదు.. రమ్యకృష్ణ నటనకు అద్దం పట్టిన చాలా సినిమాలు వున్నాయి. చంద్రలేఖ, రాజరాజేశ్వరి, దీర్గసుమంగళి భవ.. ఆవిడే శ్యామల.. ఇలా చెప్పుకుంటే పొతే పెద్ద లిస్టే ఉటుంది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ వున్న రమ్యకృష్ణని పట్టుకొని ”బాహుబలితో రమ్య నటన గురించి ప్రేక్షకులకు తెలిసింది’ అని చెప్పడం రాధకృష్ణకే చెల్లింది.
అయితే సినిమా వాడైన మారుతి కూడ ఇక్కడ వివరించే ప్రయత్నం చేయలేదు. ‘అవునండీ” అనే సమాధానంతో సరిపెట్టాడు. మరి ఆర్కే షో గనుక అక్కడ ఎక్కువ మాట్లాడే అవకాశం రాలేదో.. లేదా భలే భలే మగాడివో సినిమాలా మారుతి కూడా గతం మర్చిపోయాడో..