ఆంధ్రజ్యోతిపై న్యాయపరంగా ఎటాక్ చేసే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి సుబ్రహ్మణ్యస్వామికి ఇచ్చినట్లుగా క్లారిటీ రావడంతో… ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకును పూర్తిగా ఆయనపై ఎదురుదాడికే కేటాయించారు. ఆయన పరువు నష్టం దావా వేయాలనుకున్న ఉద్దేశం.. నేపధ్యం… ఆర్థిక సాయం ఇలా ప్రతీ అంశాన్ని విశ్లేషించి ఆయనది దురుద్దేశమేనని తేల్చేశారు. అయితే ఈ విషయంలో కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు. అందులో ఒకటి… సుబ్రహ్మణ్యస్వామి… న్యాయవాది కాదనే నిజం.
సుబ్రహ్మణ్య స్వామి అంటే… దేశంలో ఓ రకమైన ప్రచారం ఉంది. ఆయన గొప్ప లాయర్ అని.. చాలా మందిని అవినీతికేసుల్లో జైలుకు పంపారని ప్రచారం. ప్రత్యేక విమానంలో స్వయంగా తిరుమల వచ్చి… ఆయన పిటిషన్లు వేస్తే.. స్వయంగా వాదిస్తారేమోనని అనుకున్నారు. గతంలో తిరుమలపై వేసిన పిటిషన్ల విషయంలోనూ స్వయంగా వాదిస్తారన్నంతగా ప్రచారం జరిగింది. చాలా సార్లు ఆయన నల్లకోటుతో దర్శనం ఇచ్చారు. కానీ.. అవన్నీ ఉత్తుత్తి ఎలివేషన్లే. ఆయన లాయర్ కాదు. ఆయన బార్ అసోసియేషన్ సభ్యుడు కూడా కాదు. ఆయన హార్వార్డ్‌లో చదువుకున్న వ్యక్తి మాత్రమే. కానీ రాజకీయ నేతల బలహీనతలను ఆసరాగా చేసుకుని.. న్యాయవ్యవస్థను ఉపయోగించుకుని తనను తాను ఎలివేట్ చేసుకోవడంలో రాటు దేలిపోయాడనేది ఆర్కే ఊవాచ. ఆయనను లాయర్‌గా భావిస్తున్న వారు..ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి.. ఆర్కే ఈ సంచలన నిజాన్ని బయట పెట్టారని అనుకోవచ్చు.
అదే సమయంలో సుబ్రహ్మణ్యస్వామి లిటిగేషన్లకు తాను భయపడబోనని.. తాను అంత కంటే లిటిగెంట్ అన్నట్లుగా.. ఆర్కే విరుచుకుపడ్డారు. సుబ్రహ్మణ్యం చేసిన ఆరోపణలు పరువు నష్టం కిందకు వస్తాయి కాబట్టి… తాను కూడా ఆయనపై పరువు నష్టం వేస్తున్నానని కాచుకోవాలని ఆయనకు సవాల్ చే్శారు. ఆయనకు మాత్రమే న్యాయశాస్త్రంలో లొసుగులు తెలుసేమో అనుకోవద్దని.. తనకు అంత కంటే ఎక్కువ తెలుసని.. పరువు నష్టం కేసులో అసలు.. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ కు అర్హత లేదని తేల్చేశారు. ఆయన న్యాయవాది కాదు కాబట్టి టీటీడీ తరపున వాదించే అవకాశం లేదు. టీటీడీ పరువు నష్టం దావా వేస్తే ఇంప్లీడ్ అవడానికి ఆయనకు ఏ అర్హతా లేదు..ఇలా ఆర్కే చాలా చెప్పారు.
మొత్తానికి ఈ వారం ఆర్టికల్ మొత్తం సుబ్రహ్మణ్యస్వామిని టార్గెట్ చేయడమే కాదు.. తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి ఆర్కే బాగా ఉపయోగించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వేధిస్తున్నారని.. ఆదాయం లేకుండా చేస్తున్నారని..జైలుకు పంపాలని అనుకుంటున్నారని ఇలా చెప్పారు. ఎన్ని చేసినా… తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదని తన ఆర్టికల్ ద్వారా సందేశం పంపారు. ఇందు కోసం.. హందీ షోలే సినిమాలోని గబ్బర్ సింగ్ డైలాగ్‌ను సైతం వాడుకున్నారు. మొత్తానికి జగన్ ను ఎదిరిస్తున్న ఏకైక మీడియా యజమానికి.. ఏ చిన్న అవకాశం వచ్చినా తనను తాను ఎలివేట్ చేసుకోవడంలో రాధాకృష్ణ ఏ మాత్రం ఆలోచించడం లేదు.