ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ..మూతబడిన పత్రికను కొనుగోలు చేసి .. రీ ఓపెనింగ్ చేసి 20 ఏళ్లు అయిన సందర్భంగా తన ధీరోదాత్త జర్నలిజం ప్రయాణాన్ని తనకు తానే వేనోళ్ల పొగుడుకున్నారు. అయితే ఈ స్వకుచమర్దనం దారి తప్పింది. అనేక పొరపాట్లకు వివరణ ఇస్తున్నట్లుగా సాగింది. ఆర్కేకు కూడా ఇలాగే అనిపించిందేమో.. మధ్యలో ” ఆత్మరక్షణలో పడినందువల్ల ఈ విషయాలు చెబుతున్నామని ఎవరైనా అనుకుంటే పొరపాటు” అని కూడా రాసుకొచ్చారు. ఆత్మరక్షణలో పడ్డారో.. లేకపోతే ఇరవై ఏళ్లలో జరిగిన తప్పులకు వివరణ ఇచ్చారో కానీ.. ఆర్కే స్థాయిలో ఈ సమర్థింపులు.. స్వయం పొగడ్తలు మాత్రం లేవు.
ముఖ్యంగా చిరంజీవి అంశాన్నే తీసుకుంటే ఆంధ్రజ్యోతి డిజిటల్ మీడియాలో వచ్చిన కంటెంట్ తీవ్ర అభ్యంతరకరం. అలాంటివి పెట్టాలని ఆర్కే ఎవరికీ చెప్పరు. నిజానికి ఆయన చెప్పినట్లుగా డిజిటల్ మీడియాను వాడేంత సాంకేతిక పరిజ్ఞానం ఆయనకు ఉండకపోవచ్చు. కానీ మీడియాలో పని చేసే సిబ్బంది ఏ మాత్రం అవగాహన లేకుండా అంత దారుణంగా ధంబ్ నెయిల్స్ ఎలా పెట్టగలుగుతారు ?. అంత అవగాహన లేని వ్యక్తుల్ని తీసుకున్నారా ? ఏ ఉద్యోగి అయినా .. చివరికి జర్నలిస్టు అయినా బాస్‌ను మెప్పించాలని అనుకుంటాడు . అందుకే బాస్ మైండ్ సెట్ కు అనుగుణంగా పని చేస్తాడు. అక్కడ చిరంజీవికి వ్యతిరేకంగా థంబ్ నెయిల్స్ పెట్టిన వాళ్లు.. తమ బాస్‌ను ఇంప్రెస్ చేయాలని అలా పెట్టారు.. అంటే… ఆ తరహా వాటికి గతంలో ప్రోత్సాహం లభించినట్లే కదా . ఈ సూత్రం పై వరకూ వస్తుంది. ఆర్కే చెప్పినట్లుగా ఉద్యోగికి ఫలానా వార్త పెట్టాలని ఆయన చెప్పకపోవచ్చు.. కానీ ఆయన మనసులో ఆలోచనలు అర్థం చేసుకుని అవేవార్తలు రాయగలిగిన వారే అక్కడుండగలరు. అంటే… నేరుగా అలా చెప్పకపోయినా ఆర్కేనే బాధ్యత వహించాలి. తప్పించుకోలేరు.
అదే సమయంలో చిరంజీవితో తనకు సాన్నిహిత్యం ఉందని.. అందుకు బాలకృష్ణ నిష్టూరమాడాలని మరో అసంబద్ధమైన పోలిక తెచ్చి.. ఆర్కే ఇంత కురచగా ఆలోచిస్తున్నారేంటన్న అభిప్రాయాన్ని కల్పించారు. బాలకృష్ణ ఏ విషయంలో తన మీడియాను బ్యాన్ చేస్తామన్నారో చెప్పలేదు.. కానీ ఆ సంభాషణలో ఫోన్ నెంబర్ అంశంలో చిరంజీవిది గుర్తు పెట్టుకుంటారు కానీ నా నెంబర్ గుర్తు పెట్టుకోరని బాలకృష్ణ నిష్టూరమాడారట. ఇలా చెప్పాల్సిన అవసరం ఏముంది. ఇది బాలకృష్ణను తక్కువ చేయడం కాదా ? . ఓ రకంగా మళ్లీ ఫ్యాన్ వార్స్ కు కారణం అవడం కాదా ?. వ్యక్తిగతంగా చిరంజీవితో సాన్నిహిత్యం ఉంటే అది వ్యక్తిగతం. కానీ మీడియా పరంగా చేస్తున్న అతి కారణంగా ఆర్కేకు సమస్యలు వస్తున్నాయి.
ఇక్కడ ఆర్కే ఓ విషయంలో చాలా బాధపడ్డారు అదేమిటంటే.. తన దగ్గర పని చేసిన వాళ్లు .. బయటకు వెళ్లి తమపై నిందలు వేస్తున్నారని. కింది స్థాయిలో వాళ్ల సంగతి పక్కన పెడితే.. అల్లం నారాయణ, శేఖర్ రెడ్డి తో పాటు నమస్తే తెలంగాణ ఎడిటర్ అయిన తీగుళ్ల కృష్ణమూర్తి.. ఇప్పుడు సాక్షిలో బీపీలు తెచ్చుకుని మరీ చంద్రబాబుపై విరుచుకుపడే కొమ్మినేని కూడా ఆంధ్రజ్యోతిలో .. అదీ కూడా ఆర్కే పర్యవేక్షణలో పని చేసి బయటకు వెళ్లి ఆర్కేను విమర్శించినవారే. పై స్థాయి వారే అలా అంటున్నారని ఆయన బాధపడుతున్నారు.. కానీ అలా ఎందుకంటున్నారో… దశాబ్దాలుగా పని చేసి వెళ్లినా వారు బయటకు వెళ్లి అలా ఎందుకంటున్నారో ఆర్కేనే విశ్లేషణ చేసుకోవాలి. వాళ్లే అలా ఉంటే.. కింది స్థాయి సిబ్బంది ఎలా ఉంటారు ? దశాబ్దాలుగా పని చేసినా.. ఆ సంస్థలో పని చేశామని చెప్పుకునేందుకు చాలా మంది సిద్దపడరు. అసలు ఎమోషనల్ అటాచ్మెంటే ఉండదు. దానికి కారణం ఏమిటో ఆర్కేనే విశ్లేషించుకోవాలి.
ఆర్కే తన మీడియా.. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోతుందని అందుకే వందల కోట్ల ను ఆర్థికంగా నష్టపోయామని చెబుతున్నారు. అలా చేయకపోతే.. ఆ వచ్చిన రూ. మూడు వందల కోట్లతోనే ఆంధ్రజ్యోతి కనుమరుగయ్యేదని ఆర్కేకు తెలుసు. ఎందుకంటే ప్రతి మడియాకు ఓ ఆత్మ ఉంటుంది. ఆంధ్రజ్యోతికి ఆత్మ ఏంటో ఆర్కేకు తెలుసు. ఆ ఆత్మను అమ్ముకుంటే… తర్వాత అమ్ముకున్నా .. పత్రికను .. టీవీని ఎవరూ దేకరు. కానీ దాన్నే త్యాగంగా ఆర్కే చెబుతున్నారు.
ఏదైనా కారణం కావొచ్చు కానీ..మూతబడిన పత్రికను తిరిగి తీసుకుని మళ్లీ నడిపించి… ఎంతో మందికి ఉపాధి కల్పించడం మాత్రం మెచ్చదగ్గ విషయం.