ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతంలో రాసే “కొత్తపలుకు”లో ఆర్టికల్‌లో భిన్నమైన విశ్లేషణలు చేస్తూంటారు. అదంతా వన్‌సైడ్‌గా ఉన్నట్లుగా అనిపించినా… అవును.. నిజమే కదా.. అనే భావనకు వచ్చేలా చేస్తారు. అందులోనూ.. రెండు, మూడు కోణాలు ఉంటాయి. ఈ వారం.. ఆయన జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలను భిన్న కోణాల్లో ఆవిష్కరించారు. అందులో మొదటిది.. రాజకీయ కుటుంబాలపై జగన్ ప్రయోగిస్తున్న కేసులు. ఒక్క టీడీపీకి చెందిన ప్రముఖ నేతలు.. అచ్చెన్న, అయ్యన్న లాంటి వారిపైనే కాదు.. వైసీపీలో ఉన్న కీలక రాజకీయ కుటుంబాల ప్రాధాన్యతనూ జగన్ తగ్గించేస్తున్నారని ఆర్కే విశ్లేషించారు.
ఆనం, మేకపాటి, ధర్మాన, భూమన సహా వైసీపీలో ఇక ముందు… ఏ రాజకీయ కుటుంబమూ.. వారసత్వంగా కానీ.. మరో రకంగా కానీ.. ముందుకెళ్లే అవకాశమే లేదని.. ఆర్కే తన కొత్త పలుకు ద్వారా తేల్చేశారు. దీనికి కారణం.. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న లక్ష్యమంటున్నారు. అదేమిటంటే.. ఆయన ఏపీలో తన కుటుంబం.. అంటే.. వైఎస్ కుటుంబం మాత్రమే రాజకీయాల్లో ప్రముఖంగా ఉండాలని.. మిగతా వారంతా.. అనామకులైపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. పేర్లు పెట్టి మరీ.. ఆర్కే ఈ విశ్లేషణ చేశారు. గత ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. ఇది నిజమేనని చాలా మందికి అనిపించకమానదు. అయితే.. మరో కోణంలో చూస్తే.. ప్రాధాన్యత దక్కని వైసీపీ సీనియర్లందరిలో… ఓ భయాన్ని నెలకొల్పి.., వారి రాజకీయ భవిష్యత్ ను అంధకారం చేయబోతున్నారని ఆందోళన నెలకొల్పి… వారిని తిరుగుబాటుకు ప్రోత్సహిస్తున్నారేమోనన్న అభిప్రాయం కలగక మానదు.
ఈ రాజకీయ కుటుంబాలపై జగన్ పగ నుంచి చాలా నిశితంగా విశ్లేషించిన ఆర్కే.. టీడీపీకి కూడా.. ఓ సలహా ఇచ్చారు. అది జగన్ పెడుతున్న కేసుల గురించి. జగన్ పోలీసులను ఉపయోగించుకుని గెరిల్లా దాడులకు పాల్పడుతున్నారని తేల్చిన ఆర్కే.. టీడీపీ ఇంకా సంప్రదాయ రాజకీయాలు చేస్తోందని.., గగ్గోలు పెడుతోందని అంటున్నారు. ఇప్పుడు.. టీడీపీ కూడా వ్యూహం మార్చి.. గెరిల్లా దాడులకు పాల్పడాలని ఆయన పరోక్షంగా సూచించారు. అధికార పార్టీ పోలీసుల్ని ఉపయోగించుకుని గెరిల్లా దాడులకు పాల్పడుతోంది.. మరి టీడీపీ నేతలు ఏం చేయాలనుకుంటున్నారో మాత్రం ఆర్కే క్లారిటీ ఇవ్వలే్దు.
ఆర్కే ఎలా రాసినా.. అందులో టీడీపీ కోణం నుంచి చూస్తే… వేరుగా కనిపిస్తోంది. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే.. మాత్రం.. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎవరికీ అంతుబట్టనివిగా ఉన్నాయని మాత్రం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఆర్కే జగన్మోహన్ రెడ్డి వ్యూహాల్ని మరో కోణంలో ఆవిష్కరించారు. ఓ సారి మత కోణం.. మరోసారి కుల కోణం.. ఇంకో సారి ఆర్థికంగానూ విశ్లేషించారు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేస్తున్నారేమో కానీ… బయట విశ్లేషణలు చేసే జర్నలిస్టులకు మాత్రం.. ఆయన చేతల్లో లోగుట్టేమిటో తెలుసుకోలేక సతమతమవుతున్నారు.