అదానీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించే ధైర్యం భారత్ లోని ఒక్క మీడియా అయినా చేసిందా ? ఇటీవల ఎన్డీటీవీ కూడా అదానీ గ్రూప్ లో చేరిపోవడంతో… మోడీ- అదానీ కలసి కట్టుగా చేసిన దందాలను ఎవరూ ప్రశ్నించడం లేదు. కొన్ని సంస్థలు ప్రశ్నిస్తున్నాయి… వాటికి రీచ్ ఉండటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు ఈ అంశంపై నోరెత్తేవారు లేరు. ముఖ్యంగా మీడియా అయితే పూర్తి సైలెన్స్. కానీ ఆంధ్రజ్యోతి ఆర్కే మాత్రం ఈ వారం కొత్త పలుకును పూర్తిగా మోదీపై దాడికే ఉపయోగించారు. అదానీ విషయంలో మోదీకి ఎన్నో ప్రశ్నలు సంధించారు.
అదానీ విషయంలో అందరూ వేసే ప్రశ్నలను ఆర్కే ధైర్యంగా అడిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇష్టారీతిన ప్రయోగించి.. పోర్టులు, ఎయిర్ పోర్టులు కబ్జా చేసిన అంశాన్ని ధైర్యంగా రాశారు. కాదంటే . .. నిరూపించుకోవాలన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్లో ఎప్పుడూ చెప్పుతే ఆవు వ్యాసం మళ్లీ చెప్పి… గాంధీ, నెహ్రూ, ఇందిరా అంటూ కాంగ్రెస్ ను ఎగతాళి చేసి బీజేపీ ఎంపీలతో చప్పట్లు కొట్టించుకున్నా… అదానీ సమస్య మాత్రం దేశానికి నష్టం చేస్తుందని స్ఫష్టం చేశారు. దీనిపై మాట్లాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తేల్చి చెప్పారు.
అంతే కాదు మోదీ ఇతర వ్యవహారశైలినీ ఆర్కే గట్టిగా ప్రశ్నించారు. అవినీతి విషయంలో విపక్ష నేతలపై విరుచుకుపడుతున్న విషయంలో… అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ దొరికిపోయిన.. ఇంకా అదే చేస్తున్న వైఎస్ జగన్ లాంటి వారి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగానే ప్రశ్నించారు. రాష్ట్రాలు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నమోదీ ఏపీకి ఎలా అడ్డగోలుగా వేల కోట్లు అప్పులిస్తున్నారో చెప్పాలని కూడా నిలదీశారు. ఆర్కే కొత్త పలుకు మొత్తం… ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా సాగిందనుకోవచ్చు.
ఆర్కే తన పత్రిక విధానం వల్ల ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ప్రకటనలు పోగొట్టుకున్నారు. అటు కేసీఆర్ కానీ ఇటు జగన్ కానీ ఆంధ్రజ్యోతికి ఒక్క రూపాయి ప్రకటనలు ఇవ్వరు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ప్రకటనలు వస్తాయి. ఆంధ్రజ్యోతి పత్రికలో ఎడిట్ పేజీకంటే ముందే.. ఓ ఫుల్ పేజీ ప్రకటన కేంద్రం నుంచి వచ్చింది. అయినప్పటికీ.. తాను అనుకున్న విధంగా ప్రధాని మోదీని విమర్శించాడనికి ఆర్కే ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.