విశాల్ నామినేషన్ పర్వం సినిమాల్లోని యాక్షన్, థ్రిల్లింగ్ సన్నివేశాన్ని తలపిస్తూ సాగింది. తమిళనాడులోని ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో విశాల్ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం విశాల్ తన నామినేషన్ దాఖలు చేస్తే.. ‘అసంపూర్తిగా ఉన్న ఈ నామినేషన్ చెల్లదు’ అంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విశాల్‌కి షాక్ ఇచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో విశాల్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువే ఉన్న నేపథ్యంలో విశాల్ నామినేషన్ తిరస్కరణ సంచలనంగా మారింది. ఇక విశాల్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం అసాధ్యం అనుకుంటున్న తరుణంలో విశాల్ తనలోని హీరోని బయటకు తీసుకొచ్చాడు. ఆర్కే నగర్ ఎన్నికల అధికారి కార్యాలయం బయట విశాల్ తన అనుచరులతో కలసి ధర్మా చేశాడు.
దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి ఎన్నికల సంఘం అధికారులు దిగి వచ్చి విశాల్ నామినేషన్‌ని స్వీకరించడంతో.. ఈ వివాదం సద్దుమణిగింది. ‘సత్యం జయించింది’ అంటూ విశాల్ ట్వీట్ చేసి తన సంతోషం వ్యక్తం చేశాడు. నామినేషన్ పర్వం ముగిసింది.. మరి ఈ ఎన్నికల్లోనూ విశాల్ ఇదే జోరు కొనసాగిస్తే… త్వరలోనే విశాల్‌ని ఎమ్.ఎల్.ఏగా చూడొచ్చు.