తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత ఆ స్థానంలో ఏర్పడ్డ ఖాళీలో ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఎన్నికల సంఘం ఆర్కేనగర్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 21న ఆర్కేనగర్ అసెంబ్లీ ఎన్నిక జరుగనుంది. ఈ నియోజకవర్గంలో డిసెంబరు 21న పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి అదే నెల 24వ తేదీన చేపడతారని ఇసి తెలియజేసింది.
గత ఉప ఎన్నికను చివరి నిమిషంలో ఎన్నికల కమిషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పార్టీలు ముఖ్యంగా దినకరన్ వర్గం…విపరీతంగా డబ్బు పంచినట్టు ఆరోపణలు, సాక్ష్యాధారాలు కూడా వెలుగు చూడడంతో ఇసి ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 31లోగా ఈ ఎన్నికను జరుపుతామని ప్రకటించింది. అన్నట్టుగానే వచ్చే నెలలో ఆర్కేనగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు చేసింది.
పురుఛ్చతలైవిని కోల్పోయిన తర్వాత తమిళనాట జరుగనున్న తొలి అసెంబ్లీ ఎన్నిక ఇది. అమ్మఖాళీ చేసిన కుర్చీతో పాటు ఆమె వారసత్వం కోసం కూడా తీవ్రమైన పోరాటం జరుగుతున్న నేపధ్యంలో… ఈ ఎన్నిక చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఉపఎన్నిక నాటికి, ఇప్పటికీ తమిళనాట అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. శశికళ, దినకరన్ లాంటి ఓడలు బళ్లయ్యాయి. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం లాంటి బళ్లు ఓడలయ్యాయి. అంతేకాకుండా సినిమా రంగం నుంచి కమల్ లాంటి స్టార్స్ రాజకీయ పార్టీలకు రూపమిస్తున్నారు.
చెట్టు కూలిన చోట మరెన్నో మేమే నీడా తోడు అంటూ వెంట వెంటనే పుట్టుకొచ్చేశాయి. అయితే ఇవి నిజంగా నీడనిచ్చేవేనా లేక చెట్టు లేని చోట హడావిడి చేస్తున్న ఆముదం చెట్లు మాత్రమేనా అనేది తేల్చాల్సింది తమిళ ప్రజలే. ఈ నేపధ్యంలో డిసెంబరులో జరుగనున్న ఆర్కేనగర్ ఉప ఎన్నిక తమిళనాడు ప్రజల నాడిని పట్టించే అవకాశాలు ఉన్నాయి.