హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలపై కొన్ని వందల విశ్లేషణలు వచ్చి ఉంటాయి. అయితే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ఎనాలసిస్ కోసం రాజకీయం అంటే ఆసక్తి ఉన్న వారు ప్రత్యేకంగా ఎదురు చూశారు. దానికి కారణంగా కేసీఆర్ రాజకీయంపై ఆయన మొదటి అడుగులు ప్రారంభించినప్పటి నుండి ఆర్కే స్వయంగా పరిశీలిస్తూండటమే కాదు .. కేసీఆర్ సీఎం కాక ముందు వరకూ మంచి స్నేహం కూడా ఉండేది. అందుకే ఆర్కే వారాంతంలో రాసే కొత్త పలుకులో ఏం చెబుతారా అని ఆసక్తిగా చూశారు.
తన పాత స్నేహితుడు, తెలంగాణ బాద్షాగా పేరు పొందిన కేసీఆర్‌కు ఇక గడ్డు కాలమేనని.. ఆయనపై ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో హుజురాబాద్ ఫలితం బయట పెట్టిందని ఆర్కే విశ్లేషించారు. టీఆర్ఎస్ను ఎవరు అయితే ఓడిస్తారో ప్రజలు వారికే మద్దతుగా నిలుస్తున్నారని ఈ ఫలితం తేల్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులపై నిలబడేవారిని పార్టీ పరంగా చూడకుండా ఎవరైతే టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించగలరో వారికే ప్రజలు ఓట్లు వేస్తారని.. తేల్చేశారు. దానికి లాజికల్‌గా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. దాదాపుగా అరవై వేల ఓట్లు ఉన్న కాంగ్రెస్ కు అక్కడ మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్టీ నేతలు చెప్పినంత మాత్రాన ఇలా మూకుమ్మడిగా ఓ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. అయినా వేశారంటే హుజురాబాద్ ప్రజలు ఎంత క్లారిటీతో ఉన్నారో అర్థం చేసుకోవాలని అంటున్నారు.
అలాగే బీజేపీ అంటేనే గిట్టని ముస్లింలు ఈటల కోసం అదేం పట్టించుకోకుండా బీజేపీకి ఓట్లేశారని ఆర్కే విశ్లేషించారు. ఇవన్నీ చూస్తూంటే కేసీఆర్‌పై తెలంగాణ సమాజంలో పట్టరానంత ఆగ్రహం ఉందని .. అది సాధారణ ఎన్నికల్లో మరింత ప్రబలంగా బయటపడుతుందని ఆర్కే తేల్చేశారు. ప్రతిపక్షాల వల్ల ఓట్లు చీలి కేసీఆర్ లాభపడే చాన్స్ కూడా లేకుండా ప్రజలు అవగాహన తెచ్చుకున్నారని… ఎవరు టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడిస్తారో వారికే ఓటేస్తారని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులుగా కనిపిస్తారు కానీ వారిలో ఉన్న పరిణితి ఎవరికీ లేదని సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు.
ఈ వారాంతపు ఆర్టికల్‌లో ఆర్కే చెప్పిన మరో అంశం … ఈటలను కేసీఆర్‌తోనే పోల్చడం. కేసీఆర్‌ను చంద్రబాబుతో పోల్చడం. మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమబాట ఎంచుకున్నారు. ఇదే విషయాన్ని గుర్తు చేసిన ఆర్కే ఆ రోజు కేసీఆర్ విషయంలో చంద్రబాబు చేసిన తప్పే ఇప్పుడు ఈటల విషయంలో కేసీఆర్ చేశారని తేల్చేశారు. ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబుకు ఎంత నష్టం చేశారో.. రేపు ఈటల కూడా కేసీఆర్‌కు అంతే నష్టం చేయబోతున్నారని దాన్ని ఎవరూ ఆపలేరని ఆర్కే అన్యాపదేశంగా చెప్పారు. కొసమెరుపేమింటటే కేసీఆర్ హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం తీసుకొచ్చిన దళిత బంధు పథకమే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకోబోతోందని.. అది మరింత వేగంగా పతనం దిశగా తీసుకెళ్తుందని చెప్పకనే చెప్పారు.