సమతా మూర్తి విగ్రహ ప్రతిష్టాపన పేరుతో అధికార పెద్దలందర్నీ పిలిచి పొగడ్తల వర్షం కురిపిస్తున్న చినజీయర్‌పై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. అది కూడా ఈ క్రతువు ప్రారంభమైన తర్వాతే. సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ప్రారంభమైన తొలి రోజు కేసీఆర్ వెళ్లారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆ తర్వాత ఆయన అటు వైపు వెళ్లలేదు. అంతే కాదు టీఆర్ఎస్ నేతలూ వెళ్లడం లేదు. చివరికి సమతామూర్తి కార్యక్రమాల వివరాలూ ఆయనకు చెందిన మీడియాలో రావడం లేదు. దీంతో అందరూ ఏదో జరుగుతోదంని అనుకుంటున్నారు. ఇదే అంశాన్ని ఈ వారం ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన “కొత్తపలుకు”లో విశ్లేషించారు. ప్రధానమంత్రితో సాన్నిహిత్యం పెరగడంతో చినజీయర్ కేసీఆర్‌ను దూరం పెట్టారని విశ్లేషించారు.
చినజీయర్ స్వామి ఎదగడానికి కేసీఆర్ పూర్తి సహకారం అందించారు. సమతామూర్తి కార్యక్రమానికి ప్రభుత్వం తరపున మొత్తం ఏర్పాట్లను చేయించారు. కానీ చివరికి మోదీ ఆవిష్కరించిన సమతామూర్తి శిలాఫలకంపై కనీసం కేసీఆర్ పేరు కూడా లేదు. ఎక్కడా కేసీఆర్‌ను తలుస్తున్న సందర్భం కూడా లేదు. ఇదంతా తెలంగా ముఖ్యమంత్రిని అసహనానికి గురి చేస్తోందంటున్నారు. నిజానికి సమతామూర్తి నిర్మాణం వెనుక ఉన్నది తానేనన్నంతగా కేసీఆర్ ప్రచారం చేసుకోవాలనుకున్నారు. జాతీయ రాజకీయాల విషయంలో ఉత్తరాదిలో హిందూ ముద్ర తనకు సమతమూర్తి ద్వారా వస్తుందనుకున్నారు. ప్రెస్మీట్లో కూడా ఆ కోణంలోనే వ్యాఖ్యలు చేశారు. తీరా కనీసం శిలాఫలకం మీద కూడా తన పేరు లేకపోయే సరికి ఆయన హర్టయ్యారు.
ఇప్పుడు చినజీయర్ విషయంలో కేసీఆర్ కఠినంగా వ్యవహరించకపోయినా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అనుమానాన్ని కేసీఆర్ బయట పెడుతున్నారు. ఎందుకంటే యాదాద్రి ఆలయాన్ని మళ్లీ ప్రారంభించే కార్యక్రమాలను కూడా చినజీయర్ చేతులమీదుగానే నిర్వహించాలని గతంలో అనుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ మనసు మార్చుకుంటారా అన్నది కీలకం. అదే జరిగితే చినజీయర్ సామ్రాజ్యం కుప్పకూల్చే వరకూ కేసీఆర్ నిద్రపోరన్న ఓ పరోక్ష అభిప్రాయాన్ని ఆర్కే వెల్లడించే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు.
అదే సమయంలో ఏపీలో సినీ తారలను జగన్మోహన్ రెడ్డి అవమానించిన తీరును ఆర్కే విశ్లేషించారు. తన అహాన్ని అసంతృప్తి పరుచుకునేందంకు జగన్ రెడ్డి చాలా ప్లాన్డ్గా వ్యవహరించారని చెబుతున్నారు. అయితే జగన్ వ్యక్తిత్వం సంగతి సరే.. ఏదో కొంత నష్టం జరిగే సినిమా టిక్కెట్ల అంశంపై జగన్ ముందు ఇంతగా సారగిలపడాల్సిన అవసరం ఏమిటనేది రాధాకృష్ణకు వచ్చిన డౌట్. చిరంజీవికి కానీ ఆయనతో వచ్చిన వారికి కానీ టిక్కెట్ రేట్ల తగ్గింపు వల్ల కాస్త నష్టం కలుగుతుంది.. కానీ అది ఆత్మాభిమానాన్ని కూడా వదులుకునేంత కాదనేది ఆర్కే అభిప్రాయం. కానీ టాలీవుడ్ స్టార్లు అలా అనుకోలేదుగా !?