ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వారాంతపు పలుకులో ఈ సారి రెండు రాష్ట్రాల సీఎంల గురించి సమాన స్థాయిలో విశ్లేషించారు. అయితే తెలంగాణ సీఎంను కాస్త దువ్వి.. సలహాలిస్తే… ఏపీ సీఎంపై కాలు దువ్వారు. తేల్చుకుందామని.. తాను రెడీ అన్నారు. చంపినా వెనుకడుగు వేసేది లేదని.. తనకు ప్రజా క్షేమమే ముఖ్యమన్నారు.
ప్రతి వారాంతంలో ఆర్కే తన పత్రికలో ప్రచురించే కొత్తపలుకులో చాలా రోజుల తర్వాత కేసీఆర్ గురించి సానుకూలంగా రాశారు. గవర్నర్‌తో ఆయన పెట్టుకున్న లడాయి విషయంలో కేసీఆర్ తప్పులు చేస్తున్నారని.. అదే సమయంలో గవర్నర్ కూడా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని నేరుగానే చెప్పారు. కేసీఆర్ ఎలాంటి రాజకీయాలు అయినా చేయవచ్చుకానీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఆయన రాజీ పడరు. ఈ విషయాన్ని ఆర్కే నేరుగా చెప్పారు. టీఆర్ఎస్, కేసీఆర్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్న వాళ్లు ఆ విషయాన్ని పక్కన పెట్టి. .. తెలంగాణ కోణంలో ఆలోచిస్తే.. ఏ విషయంలోనూ రాజకీయాల కోసం తెలంగాణ ప్రయోజనాల్ని కేసీఆర్ పక్కన పెట్టలేదని అర్థం చేసుకోవచ్చు.ఆయన చేసే రాజకీయాలపై అభ్యంతరాలు ఉండవచ్చు.. ఇదే విషయాన్ని ఆర్కే చెప్పారు. పైగా ఆర్కే.. కేసీఆర్‌కు మొదటి నుంచి ఆప్తమిత్రుడు. ఈ మధ్య కాలంలో దూరం అయి ఉండవచ్చు కానీ ఆయన నైజం బాగా తెలుసు.
ఇప్పటికిప్పుడు బీజేపీతో లడాయి పెట్టుకోవడం వల్ల కేసీఆర్‌కు వచ్చేదేమీ ఉండదని మోదీ, షాలు బలంగా ఉన్నారని… వారితో పెట్టుకుని చంద్రబాబు లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ఆర్కే నేరుగానే చెప్పారు. ఈ సలహాను కేసీఆర్ పాటిస్తారో లేదో స్పష్టత లేదు కానీ.. హైదరాబాద్‌పై డ్రగ్స్ ముద్ర వేసేందుకు గవర్నర్ ప్రయత్నించారని.. ఇది కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షాల భేటీ తర్వాతనే ఇది జరుగుతోందన్నరు. అలాగే.. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయని.. కేసీఆర్ సన్నిహితులను టార్గెట్ చేయబోతున్నాయన్న ప్రచారం జరుగుతోందని అదే నిజమైతే కేసీఆర్ మరింత ఇరుక్కుపోతారని ఆర్కే చెబుతున్నారు.
మరో వైపు ఏపీలో జగన్మోహన్ రెడ్డి వెంట్రుక భాషపై ఆర్కే కూడా తనదైన శైలిలో స్పందించారు. అభివృద్ధి పథంలో వెళ్తున్న రాష్ట్రాన్ని పీకి పడేశారని..ఇంకేం పీకలేరన్న అర్థంలో ఆయన ఘాటుగా రాసుకొచ్చారు. తమకు గుండెపోటు వస్తుందని జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గుండెపోటు అంటే వివేకానందరెడ్డిలా హత్య చేయడానికి ప్లాన్లు వేస్తున్నారేమోనని.. దానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ఎన్ని చేసినా.. తాము ప్రభుత్వ తప్పులను ఎండగడతామన్నారు. జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని.. పదవి పోతోందని తెలిసి అలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయాన్ని తన ఆర్టికల్‌లో కల్పించారు.