ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతీ వారం రాసే కొత్త పలుకులో.. కొంత మంది రాజకీయ నాయకుల మైండ్ సెట్‌ను ట్యూన్ చేసేందుకు ప్రత్యేకంగా ప్రయత్నిస్తారు. అందు కోసమే సలహాలిస్తారు. ఈ ప్రయత్నం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. తనను వ్యతిరేకిస్తున్నారు అనుకునేవారు… ఆర్కే తనను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. రివర్స్‌లో నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించేలా ఆ పలుకులు ఉంటాయి. ఈ వారం ఆయన జూనియర్ ఎన్టీఆర్‌ను ఈ కోణంలో టార్గెట్ చేశారు.
అమిత్ షాలో ఎన్టీఆర్ భేటీని పూర్తిగా రాజకీయంగా మార్చేశారు. ఎన్టీఆర్‌తో భేటీ స్థానిక నాయకులకు కూడా తెలీదని.. నేరుగా ఢిల్లీ నుంచి కోఆర్డినేట్ చేశారన చెప్పుకొచ్చారు. అక్కడ ఎన్టీఆర్‌ను బీజేపీలో చేరాలని అమిత్ షా అడిగారని ఆర్కే చెబుతున్నారు. చిరంజీవి ఆసక్తి లేదనడం వల్లనే.. ఎన్టీఆర్‌ను అడిగారట. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్టీఆరేనని ఆర్కే చెబుతున్నారు. బీజేపీలో చేరితే యనకు చాలా మైనస్ పాయింట్లు ఉంటాయని.. అంత కంటే తెలివి తక్కువ పని లేదన్నట్లుగా ఆర్కే నేరుగానే సలహాలిచ్చారు. ఎన్టీఆర్ లేదా ఆయన సన్నిహితులు ఈ కొత్తపలుకును చదివితే.. తమను బీజేపీ వైపు వెళ్లకుండా ఆర్కే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. అనుకోవడం సహజం. ఆర్కే ఇంటెన్షన్ కూడా అదే కావొచ్చు.
వైసీపీలోని ఆయన సన్నిహితులు .. బీజేపీలో చేరడం కన్నా.. టీడీపీని స్వాధీనం చేసుకోమని సలహాలిస్తున్నారట. అది బహిరంగంగానే జరుగుతోంది. కొడాలి నాని ఈ ప్రకటన నేరుగానే చేశారు. కానీ ఈ ప్రస్తావన తక్కువగానే చేశారు. టీడీపీ భవిష్యత్ ఇవాళ కాకపోతే రేపైనా ఎన్టీఆర్ తోనే ముడిపడి ఉంటుందని ఎక్కువ మంది నమ్మకం. ఆయన ఇప్పుడు అటూ ఇటూ అయితే… చిరంజీవి లాగా రెండు కెరీర్లు దెబ్బతింటాయి. ఈ విషయం అంచనా వేయలేనంత అమాయకులు ఎన్టీఆర్ కాదని ఆర్కేనే చెబుతున్నారు.
ఆర్కే ఈ వారం అటు ఏపీ.. ఇటు తెలంగాణ ప్రభుత్వాలు… ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంలో … దాడులు… పాతబస్తీలో అలజడులు… గురించి చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా కల్పిస్తే.. అవి అంతకంతకూ దిగజారతాయి కానీ మెరుగుపడవని.. ప్రభుత్వం మారితే.. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. పనిలో పనిగా చంద్రబాబు .. ఏపీలో ప్రతిపక్షాలకు ఎంత భద్రత కల్పించారో… పాతబస్తీలో మత ఘర్షణలు లేకుండా చేశారో కూడా వివరించారు. ఈ విషయంలో మాత్రం ఆయన సూటిగా.. సుత్తి లేకుండా చెప్పారని అనుకోవచ్చు.