సింపుల్ గా పోయే విషయాన్ని చింపి చేటంత చేసుకున్న టాలీవుడ్ గురించి ఈ వారం ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వివరించారు. ఆయన ఆర్టికల్ మొత్తం మీద ఎవరిని తప్పు పట్టారంటే కేవలం అల్లు అర్జున్ను. ఆయన తన ఈగో కారణంగా సమస్యను అంతకంతకూ పెంచుకుంటూ పోయారని అది టాలీవుడ్‌కే పెనుముప్పుగా మారిందని ఆర్కే తేల్చేశారు. ఇంత చేసినా రేవంత్ మాత్రం తగ్గడం లేదన్నారు.
ఈ వ్యవహారంలో అసలేం జరిగిందో కూడా ఆర్కే వివరించారు. అల్లు అర్జున్ పేరు మర్చిపోయిన వ్యవహారమే దీనికి మూలం. అలా మర్చిపోయిన విషయం వైరల్ అయింది. రాజకీయంగానూ కేటీఆర్ ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆ టాపిక్ పై విచారం వ్యక్తం చేయాలన్న సలహాలు అల్లు అర్జున్ కు వెళ్లాయి. కానీ ఆయన రాజకీయాలతో సంబంధం లేదని తాను విచారం వ్యక్తం చేయనని చెప్పేశారట. అక్కడ్నుంచి ఇవి పెరిగిపోయాయి. ప్రెస్ మీట్ పెట్టడం మరింత రచ్చ అయింది. అల్లు అరవింద్ చెప్పినా వినని స్థాయికి అర్జున్ వెళ్లిపోయారని.. ఇక ఎవరూ ఆయనకు చెప్పలేరని ఆర్కే చెప్పుకొచ్చారు. అంటే జరిగిన వ్యవహారానికి మొత్తం అల్లు అర్జున్ దే బాధ్యత అని ఆయన ఈగో వల్లే అంతాజరుగుతోందని తేల్చారు.
పనిలో పనిగా ఆయన టాలీవుడ్ కు సలహాలిచ్చారు. తెలుగు సినిమాలు అంతా డొల్ల అని తేల్చారు. మలయాళ సినిమాలను చూసి నేర్చుకోవాలని సలహాలు ఇచ్చారు.వందల కోట్లు రెమ్యూనరేషన్లు తీసుకుని ఆ భారం బెనిఫిట్ షో ల పేరుతో ప్రజలపై వేస్తున్నారని .. అందుకే హీరోలపై వ్యతిరేకత పెరుగుతోందని కూడా విశ్లేషించారు. అల్లు అర్జున్ ఇష్యూలో ఆయనకు మద్దతు రాలేదని 70 శాతం మంది రేవంత్ రెడ్డి చర్యలకే సపోర్టు చేశారని తేల్చేశారు.
ఇక్కడ విషయం ఏమిటంటే అల్లు అర్జున్ ను చంద్రబాబు పరామర్సించడాన్ని కూడా ఆర్కే తప్పు పట్టారు. ఇలాంటి తప్పులు చేయడం చంద్రబాబుకు అలవాటేనని తీర్మానించేశారు. ఇలా చేయడం వల్ల రేవంత్‌ను వ్యతేరికించినట్లే అని ఆర్కే భావన.