ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే వారం వారం వెలువరించే కొత్త పలుకులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్న స్వరం కనిపిస్తోంది. ఆయన పత్రికలో రోజువారీగా ఒకటి చేస్తారు… తర్వాత అది తప్పేం కాదని ఆయన ఆర్టికల్ రాస్తారు. పనిలో పనిగా .. టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఏదో చేసేస్తున్నారని పుకార్లను ప్రజల్లోకి పంపుతున్నారు. మళ్లీ అందులోనే రివర్స్ లో అలాగే చేయాలని వేరే సందర్భంలో సలహాలిస్తున్నారు. ఈ వారం కొత్త పలుకు ఆర్టికల్ లో చంద్రబాబును ఎలా బద్నాం చేయాలో సాక్షి పత్రిక కూడా ఆర్కే నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది.
వైసీపీ హయాంలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులే .. టీడీపీ సర్కారులోనూ కీలకంగా ఉంటున్నారని.. గత వారం పది రోజులుగా ఆంధ్రజ్యోతి పత్రిక రాయని సందర్భం లేదు. చివరికి లోకేష్ పేషీపైనా నిందలేశారు. వీటిని చూసి చూసి, చదివి టీడీపీ సానుభూపతిపరులు ఓహో ఇంత జరుగుతుందా అనుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టుల్ని పట్టుకొచ్చి.. టీడీపీ క్యాడర్ లో అసంతృప్తి ఉందని ఆర్కే రాసుకొచ్చారు. అంతేనా.. అధికారులు వాళ్లే ఉంటారని.. ఉన్న వాళ్లలో మంచి వాళ్లతో పని చేయించుకోవడం ప్రభుత్వ విధానమని క్యాడర్ గుర్తించాలని సలహాలిచ్చారు. అంటే ఇక్కడ అసలు సమస్యను ఆంధ్రజ్యోతే ప్రారంభించింది. చివరికి ఆర్కే కవరింగ్ ఇస్తున్నట్లుగా రాసుకొచ్చారు. అసలు ప్రభుత్వ అధికారులలో ఎవరు ఏం చేశారో… టీడీపీ వాళ్ల కంటే… ఆంధ్రజ్యోతికి ఎక్కువ తెలుస్తుందా ?
ఇదొక్కటే కాదు.. ఫలనా ఎమ్మెల్యే నాలుగు బార్లు లాగేసుకున్నారని.. మరో ఎమ్మెల్యే కప్పం కట్టమని ఆదేశించారని ఇలా పుకార్లను తన రాతల్లో రాసుకొచ్చారు. ఇలాంటివి చేసినందుకే జగన్ ను ఓడించారని మళ్లీ కబుర్లు. మళ్లీ ఇదే ఆర్టికల్ లో .. వైసీపీ నేతలు.. టీడీపీ సానుభూతిపరులు.. ఇతరుల వ్యాపారాలను లాక్కున్నారని వారివి వారికి మళ్లీ తిరిగి ఇప్పించాల్సి ఉందని రాసుకొచ్చారు. ఆ ఎమ్మెల్యే లాగేసుకున్న నాలుగు బార్లు టీడీపీ వాళ్ల దగ్గర వైసీపీ వాళ్లు లాక్కున్నవేనని ఎందుకు అనుకోకూడదు..? . పెద్ద వ్యాపారాలకు ఓ రూల్.. చిన్న వ్యాపారాలకు మరో రూల్ అమలు చేయాలని ఆర్కే చెబుతున్నాడా ?. ఏపీలో బార్ల బిజినెస్ ను వ్యాపారులు వదిలించుకోవడానికే ఆసక్తిగా ఉన్నారు. వాటి కోసం బెదిరించాల్సిన అవసరం కూడా లేదని అందరికీ తెలుసు. చాలా మంది లైసెన్స్ ఫీజులు కూడా కట్టలేకపోతున్నారు. కానీ ఆర్కేకి మాత్రం వాటిని లాగేసుకుంటున్నారని అనిపించింది.
జగన్ రెడ్డి చేసినట్లుగా చేయాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆర్కే చెబుతున్నారు. అలాంటి పరిస్థితిని తెచ్చింది.. ఓ రకంగా ఆంధ్రజ్యోతినే. వైసీపీ సానుభూతిపరులే ఇంకా రాజ్యం చేస్తున్నారని ప్రతీ రోజూ రాసి .. .వారిలోఅసంతృప్తి పెంచుతున్నారు. తీరా వారాంతంలో మాత్రం ఆయన వివేకానందుడిలా నీతులు చెబుతూ తెరపైకి వస్తున్నారు. టీడీపీకి ఎక్కడో మూల సుద్దులు చెబుతున్నట్లుగా ఆయన రాసుకొస్తున్న ఆర్టిక్లల్స్.. నిజానికి టీడీపీని టార్గెట్ చేసినట్లుగా ఎవరికైనా అనిపిస్తుంది. ప్రభుత్వం ప్రారంభమై నేల మాత్రమే అయిందంటారు. మళ్లీ ఏదేదో చెబుతూంటారు. మొత్తంగా ఆయన ఫ్రస్ట్రేషన్ …తనకు చేతనైన పద్దతిలో ప్రతి వారం చూపిస్తున్నారు. దానికి కారణం ఏమిటో .. ఆయనకు.. ఆయన సన్నిహితులకు.. టీడీపీలో ఉన్న పెద్దలకే తెలియాలి.