ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఎప్పటి నుండో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన గులాం నబీ ఆజాద్‌పై పేరుకుపోయిన కోపం ఉన్నట్లుగా ఉంది. ఆయన ఈ వారం కొత్తపలుకు ఆర్టికల్ మొత్తాన్ని ఆయనపైనే కేంద్రీకరించారు. విచిత్రంగా ఇందులో ఆయన తెలుగు నేతల నుంచి పెద్ద ఎత్తున మూటలు తీసుకున్నారని రాసేశారు. పార్టీకి ఇవ్వాల్సిన ఫండ్స్ కాకుండా వ్యక్తిగతంగా ఆయన తీసుకున్నట్లుగా ఆర్కే తేల్చారు.
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దుస్థితికి ఆజాదే కారణమని ఆర్కే రూలింగ్ ఇచ్చేశారు. వైఎస్ హయాంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న ఆజాద్ విపరీతంగా చక్రం తిప్పారు. అందులో డౌట్ లేదు. ఆ సమయంలో హైకమాండ్ వద్ద భారీగా పలుకుబడి ఉన్న ఆజాద్… వైఎస్ గురించి గొప్పగా చెప్పి తిరుగులేని నేతగా చేసింది కూడా ఆయనేనని ఇతర నేతల్ని ఎదుగనీయకుండా చేశారని.. అందుకే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నేతలంటూ ఎవరూ లేరని ఆర్కే తేల్చేశారు.
ఆజాద్ వైఎస్ హయాంలో ఏపీలో ఓ వెలుగు వెలిగారు. ఎన్టీవీలో ఆయనకు మొదట్లో షేర్ కూడా ఉండేది. ఇప్పుడు ఉందో లేదో స్పష్టత లేదు. ఆప్పట్లో ఆయన హైదరాబాద్‌లోనే ఎక్కువ కాలం గడిపేవారని చెబుతూంటారు . ఈ క్రమంలో ఆజాద్ విషయంలో ఆర్కేకు ఏదైనా విషయంలో వివాదం వచ్చిందేమో కానీ.. చాన్స్ వచ్చిందని ఆయన ఈ సారి ఆజాద్‌పై విరుచుకుపడ్డారు. ఆజాద్‌ను.. కాంగ్రెస్ పార్టీని పీల్చి పడేసిన జలగ అనేశారు.
అయితే ఆజాద్ వ్యవహారాన్ని లోతుగా విశ్లేషించిన ఆర్కే.. కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా పొగిడారు. ఆ పార్టీ దేశానికి అవసరమంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రాధాన్యం దక్కకపోవడానికి రాహుల్ గాంధీ కారణం కాదని సర్టిఫికెట్ ఇచ్చారు. ఆయన ఇటీవల రాహుల్ గాంధీతో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మొత్తంగా ఆర్కే .. ఎప్పుడూ బీజేపీ ని విమర్శిస్తారేమో కానీ… కాంగ్రెస్ ను పొగడరు. కానీ ఈ సారి మాత్రం బీజేపీని విమర్శించలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీని మాత్రం.. ఓ రేంజ్ లో ఎత్తేశారు. అందుకే ఈ వారం కొత్తపలుకు వెనుక చాలా లోగుట్టు ఉంటుందనే సందేహాలు పెరుగుతున్నాయి.