ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే మార్చిలో జరగబోతున్నాయని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే జోస్యం చెప్పారు. ప్రతీ వారాంతంలోఆయన రాసే “కొత్తపలుకు”లో ఈ సారి ముందస్తు ఎన్నికల గురించే ఎక్కువ విశ్లేషించారు. వైసీపీ రాజకీయ కార్యకలాపాలను విశ్లేషించి.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల్ని కూడాచెప్పి.. జగన్ వేస్తున్న రాజకీయ అడుగులు.. ప్రకటనలను కూడా ఉదహరించి.. వచ్చే మార్చిలో ఎన్నికలు ఖాయమని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఓ షరతు ఉంది.. అదేమిటంటే కేంద్రం సహకరిస్తేనే అని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు కేంద్రం సహకరిస్తుదా లేదా అన్నదానిపై జగన్ తుది నిర్ణయం ఉంటుందంటున్నారు.
మరీ విచిత్రంగా ఆర్కే “కొత్తపలుకు”లో చెప్పిందేమిటంటే.. జగన్ ముందస్తుకు వెళ్తే కేసీఆర్ కూడా వెళ్లాలని అనుకుంటున్నారట. ఇప్పటివరకూ కేసీఆర్ ధైర్యంగా ముందస్తుకు వెళ్తారని.. ఆయనతో పాటు జగన్ కూడా వెళ్తారని చెప్పుకుంటున్నారు. కానీ కేసీఆర్ ముందస్తుకెళ్లాలంటే కేంద్రం సహకరించాలి. బీజేపీతో లడాయి పెట్టుకున్నందున బీజేపీ సహకరించదని ఆర్కే చెబుతున్నారు. జగన్ ముందస్తుకెళ్తే.. జగన్తో పాటు రాజీనామా చేస్తే రెండు రాష్ట్రాల్లోనూ ఒకే సారి ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ అంచనా అంటున్నారు. అయితే ఈ ఆర్కే పలుకు కంటే ముందే అమిత్ షా హైదరాబాద్లో తాము ఎన్నికలకు రెడీగా ఉన్నామని కేసీఆర్కు సవాల్ చేశారు. అంటే.. కేసీఆర్ ముందస్తుకు వెళ్తామంటే తాము ఆపబోమని ఆయన చెప్పినట్లయింది.
మరో వైపు జగన్ రాజకీయ వ్యూహాలను కూడా ఆర్కే విశ్లేషించారు. ఈ సారి ఎమ్మెల్యేల్లో రెడ్డి సామాజికవర్గాన్నిపూర్తిగా పక్కన పెట్టాలనుకుంటున్నారట. అన్ని పదవుల్లో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నట్లుగా అభ్యర్థుల్లోనూ మార్పులు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారట. బహుశా.. సగం మంది రెడ్డి నేతలకు.. మిగతా సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకు ఇస్తారేమోనని ఆయన పరోక్షంగా చెప్పారు. ఓసీ అంటే వైసీపీ ఆలోచనల్లో రెడ్డి సామాజికవర్గం ఒక్కటే. అంతే కాదు జగన్ సానుభూతి కోసం చాలా చేయబోతున్నారని హింటిచ్చారు. అంటే మరిన్ని కోడికత్తులు రావొచ్చని ఆర్కే పరోక్షంగా చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఆలస్యమైతే ఎక్కడ వ్యతిరేకత పెరిగిపోయి.. మొదటికే మోసం వస్తుందోనని.. ముందస్తుకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నది నిజం. దీన్ని ఆర్కే తనదైన శైలిలో వివరించారు. అయితే ప్రభుత్వాలు ముందస్తుకెళ్తాయా లేదా అన్నది ఈ ఏడాది చివరిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం.