మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు ముడి పెట్టి ఈ వారం ” కొత్తపలుకు” నింపేశారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. అయితే తన ఆర్టికల్ మొత్తం మీద బీజేపీని ఎక్కడా పెద్దగా తప్పు పట్టలేదు. వారి రాజకీయం వారు చేస్తున్నారని.. కానీ చాన్స్ ఇస్తోందని మాత్రం పార్టీల అధినేతలేనని విశ్లేషించారు. మహారాష్ట్ర విషయానికి వస్తే ఉద్దవ్ ధాకరే ఎవర్నీ కలవకపోవడం.. పార్టీ నేతలను పట్టించుకోకపవడం వంటి కారణాల వల్ల ఎమ్మెల్యేలు దూరమయ్యారని.. ఈ విషయాన్ని గ్రహించి బీజేపీ షిండే రూపంలో అందర్నీ ఏకంగా చేసిందని తేల్చారు. ఈ విషయంలో తప్పు ఉద్దవ్ ధాకరేదేనని.. ప్రజాస్వామ్యంలో ఎలా ఉండకూడదో అలా ఉన్నారని అర్కే చెబుతున్నారు
తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కూడా ఉద్దవ్ ధాకరే కన్నా ఎక్కువగా “ఆటిట్యూడ్” చూపిస్తున్నారని వారికీ షిండేలు ఎదురు కావొచ్చని ఆర్కే ఉదాహరణ పూర్వకంగా చెప్పారు. టీఆర్ఎస్లో ఏక్నాథ్ షిండే లాంటి నేతలు హరీష్ రావు, కేటీఆర్ అని తేల్చారు. మరో పవర్ సెంటర్‌గా సంతోష్ రావు ఉన్నా.. ఆయన నేరుగా రాజకీయం నుంచి రాలేదు కాబట్టి ఏమీ చేయలేరరని తేల్చారు. ఇప్పుడు మహారాష్ట్ర పరిణామాలతో హరీష్ రావుకు మరింత మంచి ప్రాధాన్యత వస్తుందని ఆర్కే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గతంలో షిండే తరహాలోనే హరీష్ రావును దువ్వడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేసిందట. కానీ హరీష్ రావు .. బుట్టలో పడకపోవడంతో వదిలేసిందని చెబుతున్నారు. తర్వాత చేస్తారో లేదో తెలియదు కానీ.. అప్పట్లో కేసీఆర్ హరీష్ ను దూరం పెట్టడానికి అదే కారణం అని ఆర్కే చెబుతున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్‌పై తిరుగుబాటు చేసే షిండేలు లేరని ఆర్కే అంచనా.
ఏపీకి సంబంధించినంత వరకూ తెలంగాణ పరిస్థితులే ఉన్నాయి. నెంబర్ టూ అంటూ ఎవరూ లేరు. జగన్ చుట్టూ తిరిగి పనులు చక్క బెట్టే సజ్జల, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి వంటి వాళ్లకు జన బలం లేదు. వాళ్లతో నేతలు, ఎమ్మెల్యేలు వెళ్లరు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తిరుగుబాటుప్రజల నుంచి వస్తుందని ప్రతి ఒక్క ఓటరు ఓ ఏక్ నాథ్ షిండే అవుతారని ఆర్కే చెబుతున్నారు. దానికి ఎన్టీఆర్ కాలం నాటి ఉదాహరణలను ఆర్కే చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాచరికం అమలు చేస్తామంటే ప్రజలు సహించరని ఆ విషయం ఎన్నో సార్లు రుజువైందని కొంత ఆర్కే చెబుతున్నారు.
మొత్తంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ధాకరే ఎంతగా ప్రజలకు .. పార్టీ నేతలకు దూరంగా ఉంటారో… తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అంతే ఉంటున్నారని ఆర్కే తేల్చారు. అయితే శివసేనలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసి ఉండవచ్చు కానీ.. తెలుగు రాష్ట్రాల్ోల ప్రజలు చేయబోతున్నారని చెబుతున్నారు. అదే జరుగుతుందని నిశ్చయంగా చెబుతున్నారు.