ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం మీడియలో తానే అఖండ అన్నట్లుగా స్వయం ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలనే ఇరుసుగా చేసుకున్నారు. ఇటీవల సీఎం జగన్ .. ఎప్పట్లాగే.. తన ప్రసంగం చివర మీడియా సంస్థలపై విమర్శలు చేశారు. ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు అంటూ లిస్ట్ చదివి మారీచులు..ఉన్మాదాలు ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు నథింగ్ ని.. తాము వీటితోనే పోరాడతాం అన్నారు. ఆర్కేకు ఇది బాగా నచ్చినట్లుగా ఉంది. తనను.. తన సంస్థను హైలెట్ చేసుకోవడానికి దాదాపుగా ముఫ్పై శాతం ఆర్టికల్ కేటాయించారు.
తమను మారీచుడు అన్న జగనే మారీచుడు అని ఎప్పట్లాగే కథలు కథలుగా చెప్పారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. తాము మాత్రమే ప్రభుత్వంపై పోరాడుతున్నామన్నట్లుగా జగన్ మాటల్ని ఆసరాగా చేసుకుని గొప్పగా చెప్పుకోవడమే కాస్త ఎబ్బెట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆర్కేకు .,.ఆంధ్రజ్యోతికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారో కానీ.. దాన్నే అడ్వాంటేజ్‌గా తీసుకుని .. ప్రజల కోసం రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని ఆర్కే తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. తమకు రూ. రెండు వందల యాభై కోట్ల విలువైన యాడ్స్ రావాల్సి ఉన్నా.. జగన్ రానివ్వలేదని.. అయినా తగ్గలేదని… చాలా మందితో రాయబారాలు పంపినా తాము పట్టించుకోలేదని… ఇలా చాలా ఎలివేషన్లు క్రియేట్ చేసుకున్నారు. ప్రభుత్వంపై పోరాటంలో తమను తాము ఓ అఖండలా ప్రొజెక్ట్ చేసుకున్నారు.
ఈ టెంపోను మిగతా ఆర్టికల్ మొత్తం కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి ఎలా అందర్నీ దూరం చేసుకున్నారో వివరించారు. ఆయనను గెలిపించిన అన్ని వర్గాలూ ఇప్పుడు ఆయన ఓటమి కోసం పనిచేయబోతున్నాయని ప్రకటించారు. బ్రదర్ అనిల్ క్రిస్టియన్ పార్టీ పెట్టబోతున్నట్లుగా కూడా తేల్చేశారు. క్రిస్టియన్ పార్టీ పెడితే జగన్ ఓటు బ్యాంక్ చీలిపోతుందని ఆర్కే అంచనా వేశారు. ఇదంతా మీడియా వల్ల కాదు కదా అని జగన్‌కు చాయిస్ ఇచ్చారు.
సోమవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందులో ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటారన్న అభిప్రాయం ఉంది. ఉదయమే ఈ మీటింగ్ గురించి బయటకు తెలిసింది. అయినప్పటికీ ఆర్కే ఈ అంశాలపై స్పందించలేదు. కేవలం జగన్‌కే పరిమితం చేశారు. బహుశా.. ఈ సారి కేసీఆర్ ఏం చేయబోతున్నారో.. ఆర్కేకు కూడా సమాచారం లేదేమో ?