ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ కుటుంబంలో ఏం జరుగుతుందో తనకు సమాచారం వస్తుందన్న అతిశయంతోనే లేకపోతే.. మరొకటో కానీ ఎక్స్ ట్రీమ్ గా ఆలోచిస్తున్నారు. ఆ విషయం ఈ వారం కొత్త పలుకుతో మరోసారి స్పష్టమయింది. అసలు వివేకా హత్య ఎందుకు అనే విషయంలో ఆర్కే కొత్త కోణం వినిపించారు. అదేమిటంటే.. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళ్తే భారతి రెడ్డి సీఎం అవకుండా వివేకానందరెడ్డి అడ్డుకుంటారని.. షర్మిల లేదా విజయమ్మను సీఎం చేయమని పట్టుబడతారన్న కారణంగా హత్య జరిగిందని ఆర్కే విశ్లేషించారు.
కానీ ఆర్కే జగన్ పై వ్యతిరేకత.. వివేకా హత్య కేసులో జగన్ దంపతులపై వీలైనంత ఎక్కువగా ప్రజల్లో అనుమానాలు కల్పించాలన్న లక్ష్యంతో ఇలా రాసినట్లుగా కాస్త లాజిక్ తో ఆలోచించిన వారికి అనుమానం వస్తుంది. ఎందుకంటే.. వివేకానందరెడ్డి హత్య అసలు వైసీపీ గెలవక ముందు జరిగింది. ఎన్నికలు జరగక ముందు జరిగింది. అప్పట్లోనే వైసీపీ గెలుస్తుందని తీర్మానించుకుని తన పదవీకాలంలోనే జైలుకెళ్తానని జగన్ నిర్ణయించుకుని ఆ తర్వాత తన భార్యను సీఎంను చేయడానికి కుటుంబంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడతాయో ఆలోచించుకుని అడ్డు తప్పించుకునేందుకు వివేకా హత్యకు ప్లాన్ చేస్తారా అని ఎవరికైనా డౌట్ వస్తుంది. అందుకే ఆర్కే చెప్పిన దాంట్లో లాజిక్ ఉండదని చెబుతున్నారు.
ఈ వారం కొత్త పలుకులో ఆర్కే అవినాష్ రెడ్డి సాక్షేనని అసలు ప్లానర్స్ జగన్ దంపతులు అనే అభిప్రాయాన్ని కల్పించడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ హత్య కేసును జగన్ రెడ్డికి చుట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పదే పదే ఆరోపిస్తున్నారు. వారి ఆందోళనను ఆర్కే మరింతగా పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే జగన్ దంపతులకు తెలిసిందన్నది నిజం. దాని చుట్టూనే ఇప్పుడు కేసు నడుస్తోందని చెబుతున్నారు
తన కొత్త పలుకులో ఈ వారం కేసీఆర్ అంశంపైనా విశ్లేషించారు. కేసీఆర్ బీజేపీపై ప్రకటించిన అసహజ యుద్ధం వల్లనే కవిత అరెస్టయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని దీనంతటికి కారణం ఆయనేనని తేల్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను పక్కాగా ఇరికించేశారని తేల్చారు. మొత్తం.. జగన్ విషయంలో ఆర్కే ఆలోచనలు.. ఎక్స్ ట్రీమ్ గా వెళ్తున్నాయని లాజిక్ లకు కూడా అందడంలేదని స్పష్టమవుతోంది.