ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇప్పటి వరకూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేశారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అనాలోచితంగా ఉంటాయని.. తెలికి తక్కువ వ్యక్తి అని అనేక సార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కానీ ఇప్పుడు ఆయన తన మనసు మార్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరూ ఊహించనంత తెలివితేటలున్న వ్యక్తి అని అంగీకరించారు. తన వారంతపు ఆర్టికల్ కొత్తపలుకులో ఈ సారి జగన్మోహన్ రెడ్డిపై కాస్త తేడాగా అయినా సరే ప్రశంసలు కురిపించారు. ఆయన అసాధారణమైన తెలివి తేటలున్న వ్యక్తిగా నిర్ధారించారు. అయితే ఆ తెలివి తేటలు రాష్ట్రం కోసం వాడటం లేదని.. కేవలం తన వ్యాపారాల కోసమే వాడుతున్నారని ఆయన చెబుతున్నారు.
ఈ వారం తన ఆర్టికల్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి.. జగన్ నిర్ణయాలతో ఎలా కుదేలయిపోతుందో ఎక్కువగా విశ్లేషించారు. ఉదయం రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన చాలా విషయాలు ఈ సారి కొత్తపలుకులో కనిపించాయి. అప్పులతో నడిచినంత కాలం నడిపించి.. రాష్ట్రాన్ని దిక్కు లేకుండా వదిలేసి …వెళ్లిపోయే వ్యూహం కనిపిస్తోందని ఆర్కే చెబుతున్నారు. అదే సమయంలో ఇలా చేస్తున్న జగన్ను తెలివి తక్కువ వాడని అనలేమని.. ఆయన వ్యాపారాలు ఎలా అప్పుల్లేకుండా.. రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లకు ఎలా చేరాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయన్నారు. అదానీతో సొంత వ్యాపారాలపై రెండు, మూడు గంటల పాటు చర్చించగలిగిన ఆయన ఏపీలో పెట్టుబడుల కోసం .. ఒక్క సమావేశం పెట్టలేదని గుర్తు చేశారు.
రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లుగా కాగ్ తేల్చినప్పటికీ.. అపరిమితమైన అప్పులు చేస్తున్నట్లుగా తేలినప్పటికీ కేంద్రం ఎందుకు చూసీచూడనట్లుగా ఉంటుందో ఆర్కేకి కూడా అర్థం కావడం లేదు. తప్పుడు లెక్కలు చెబుతున్నారని కాగ్ అదే పనిగా లేఖలు పంపుతోంది..కానీ కేంద్రం మాత్రం రాష్ట్రానికి అందించాల్సిన సహకారం అందిస్తోంది. ఈ పరిణామాలపైనే.. కేంద్రం కూడా జగన్ను నియంత్రించడం లేదని ఆర్కే అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం తీసుకుంటున్న అప్పులతో బండి నడిపించి వచ్చే ఏడాదే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న అభిప్రాయాన్ని ఆర్కే వ్యక్తం చేస్తున్నారు. చేతులెత్తేసే పరిస్థితి వస్తే ఆయన ప్రజల వద్దకు వెళ్లి మరో టర్మ్ పొడిగించుకునే ఆలోచన చేస్తారని అంటున్నారు. జగన్ తెలివితేటలు సామాన్యమైనవి కావని ఆర్కే చెబుతున్నందున.. జగన్ అంతకు మించి ఆలోచన చేసినా చేయవచ్చు.