ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఒక వారం చెప్పినదానికి మరో వారం చెప్పేదానికి పొంతన ఉండటం లేదు. తనకు ఖచ్చితమైన సమాచారం ఉందన్నట్లుగా తన ఆర్టికల్‌లో మసాలా దక్కించి రాస్తారు. తర్వాత వారం తూచ్ అంటారు. ఇటీవలి కాలంలో ఇది మరీ ఎక్కువైపోయింది. గతంలో పలుమార్లు తన కొత్తపలుకులో కేసీఆర్‌ను జైలకు పంపడం ఖాయం.. రాష్ట్రపతి ఎన్నికలు ముగియడమే ఆలస్యం అని వాదించారు. కానీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్‌పై కేసులు పెట్టడానికి బీజేపీ సిద్ధంగా లేదని కానీ ఆయన సన్నిహిత వ్యాపారవేత్తలను మాత్రం టార్గెట్ చేస్తుందని చెబుతున్నారు.
బీజేపీ వ్యూహాలను అర్థం చేసుకోవడంలో ఆర్కే కూడా విఫలమవుతున్నారు. గతంలో చంద్రబాబు పదవి ఉడగొట్టినట్లే ఇప్పుడు కేసీఆర్ పదవి ఉడగొట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ కేసులు పెట్టి .. అరెస్టులు చేయించడం.. వేధించడం వంటిది చేయదని అంటున్నారు. చంద్రబాబును ఎలా నియంత్రించారంటే.. ఎన్నికల్లో వారికి ఆర్థిక సాయం అందకుండా అడ్డుకోవడం ద్వారా ఓడించారని ఆర్కే చెబుతున్నారు. అయితే ప్రజలు వ్యతిరేకంగా ఓట్లు వేయకుండా ఎవరూ ఓడిపోయారు. డబ్బులు అందనంత మాత్రాన ఓటమి రాదనే విషయాన్ని ఆర్కే చెప్పలేకపోతున్నారు.
ఆర్కే లక్ష్యం ఎలాగైనా సరే .. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ వెళ్లకూడదన్న అజెండాతో ఆయనచాలా కాలంగా ఈ కొత్త పలుకు వినిపిస్తున్నట్లుగా ఉంది. అనవసరంగా మోదీతో పెట్టుకుంటే రాజకీయంగా భూస్థాపితం అవడం ఖాయమని ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేసీఆర్ అచ్చమైన రాజకీయ నాయకుడు. ఏం చేస్తే ఏం వస్తుందో ఆయనకు తెలుసు. అయితే ఆయన ముందడుగు వేయకుండా కట్టడి చేయడానికి ఆర్కే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఆయనపై కేసులు పెడతారని..జైలుకు పంపిస్తారని వాదించిన ఆయన ఇప్పుడు ఆయన సన్నిహితులపై గురి పెట్టారని చెబుతున్నారు.
ఆర్కే కొత్తపలుకులో తన రాజకీయ విశ్లేషణ కాకుండా తాను కోరుకుంటున్న రాజకీయం కోసం మైండ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. ఇప్పటి వరకూ ఏపీ రాజకీయాల్లోనే ఆయన ఇలాంటి కామెంట్స్ చేసేవారు. కానీ తెలంగాణ రాజకీయాల్లోనూ ఆయన బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకున్నట్లుగా రాస్తున్నారు. మోదీ, షాలను ఎదుర్కొనే శక్తి దేశంలో ఎవరికీ లేదని చెప్పడమే దీనికి సంకేతం. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరొగచ్చు… బలవంతులు ఎవరూ ఉండరు. దీనికి శ్రీలంకే ఉదాహరణ. ఏదైనా ఘటన జరిగే వరకూ ఇలా మన దగ్గర జరగడం అసాధ్యం అనుకుంటారు. కానీప్రజల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఈ లాజిక్‌ను ఆర్కే మర్చిపోతున్నారు. మోడీ, షాలను మోసేస్తున్నారు.