తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై నిరంతరం విమర్శలు చేయడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఈ సారి ప్రత్యేకమైన కారణాలు దొరకలేదు. అందుకే ఆర్థిక కష్టాలనే తన వారాంతపు ఆర్టికల్‌కు ముడి సరుకుగా వాడేసుకున్నారు. అయితే ఇక్కడ చివరిలో ఇచ్చిన ఫనిషింగ్ టచ్‌నే కాస్త ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఈ అంశంలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను లాగేశారు ఆర్కే. రాష్ట్రాల్లో పెరిగిపోతున్న .. సంక్షేమం పేరుతో పంచుడు ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యతను జస్టిస్ ఎన్వీ రమణ తీసుకోవాలన్నారు. అలా తీసుకుంటే దేశం మొత్తానికి మేలు చేసిన వ్యక్తిగా ఉంటారని కూడా చెప్పుకొచ్చారు. లేకపోతే మొదటగా రాష్ట్రాలు.. ఆ తర్వాత దేశం దివాలా తీస్తుందని ఆందోళన చెందారు.
ప్రభుత్వ పథకాల విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా.. న్యాయవ్యవస్థ అయినా ఎలా స్పందిస్తుందో ఆర్కే చెప్పలేకపోయారు. అయితే సీజేఐకి ఉండే విస్తృతాధికారాలను అలా ఉపయోగించుకోవాలని సూచిస్తున్నట్లుగా ఉంది. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అని.. దేశం మొత్తం దివాలా తీస్తుందని తెలిసినా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు.. వాటిని ఎన్నుకున్న ప్రజలు ఏ మాత్రం మార్పు లేకుండా ఓట్లు వేస్తున్నప్పుడు సీజేఐ ఇలాంటి ప్రయత్నాలు చేసినా తప్పు పట్టే వారే ఎక్కువ ఉంటారు. ఇలా చేయాలంటే అందరూ బాధ్యతగా ఫీలవ్వాలి. అటు ప్రజలు.. ప్రభుత్వాలు కూడా బాధ్యతగా ఫీలవ్వాలి. అాలంటి రోజు వచ్చినప్పుడు మాత్రమే ప్రయోజనం. సీజేఐ పథకాలపై ఆంక్షలు విధిస్తే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. చాలా విషయాలు చెప్పే ఆర్కేకి ఈ విషయం తెలియనిది కాదు. అయినా ఎందుకు సీజేఐని ఇన్వాల్వ్ చేశారో అర్థం కాని విషయం.
అదే సమయంలో ఏపీ ఆర్థిక పరిస్థితుల్ని.. తెలంగాణ ఆర్థిక పరిస్థితుల్ని పోల్చి చేశారు. ఏపీ దివాలా అంచునకు చేరిందని ఏడాదిగా ఆయన చెబుతున్నారు . ఇప్పుడు తెలంగాణ కూడా అదే స్థితికి చేరిందని తేల్చేశారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యమయ్యేవి కావు. కానీ ఇప్పుడు తెలంగాణలోనూ ఉద్యోగుల జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. భవిష్యత్‌లో ఒకటో తేదీనే ఇస్తామని హరీష్ రావు అదో పెద్ద హామీగా ప్రకటించడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఏపీలో జగన్ చేసినట్లుగా పంచుడు పథకాలను కొత్తగా ప్రకటించడం ద్వారా తెలంగాణను దివాలా స్థితికి కేసీఆర్ తెచ్చారని ఆర్కే విశ్లేషించారు.
రెండు ప్రభుత్వాలపై విపరీతమైన ప్రజాగ్రహం ఉందని.. అందుకే వారు పంచుడు పథకాలతో ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్కే చెబుతున్నారు. ఇవన్నీ దాదాపుగా ప్రతీ వారం చెప్పేవే కానీ.. ఈ మ్యాటర్‌లోకి సీజేఐని తీసుకు రావడమే కాస్త ఎబ్బెట్టుగా ఉంది.