మాజీమంత్రి , వైసీపీ నాయకురాలు రోజా ఇక పార్ట్ టైం పాలిటిక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ హయాంలో మంత్రి పదవి వరించాక ఫుల్ టైం పాలిటిక్స్ చేసేందుకు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు రోజా. జబర్దస్త్ ను వీడారు. వైసీపీ ఓటమి పాలయ్యాక జగన్ నిర్వహించే సమావేశాలకూ హాజరయ్యారు. కొంత వాయిస్ రైజ్ చేసే ప్రయత్నం చేశారు. కొంతకాలంగా ఆమె రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే బుల్లితెర ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రోజా బుల్లితెర ఎంట్రీ రకరకాలైన అనుమానాలను లేవనెత్తుతోంది. వైసీపీ కష్టకాలంలో జగన్ కు రోజా అండగా ఉంటుందని వైసీపీ భావించింది. కొన్నాళ్లుగా సైలెన్స్ అవ్వడంతోపాటు బుల్లితెరపై కనిపిస్తున్నారు. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో కొత్త సీజన్ ప్రారంభం అయింది. ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఈ షోకు యాంకర్ గా ఉన్నారు. రోజాతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా? అనే ప్రచారం జరుగుతోంది.
అయినప్పటికీ ఇప్పటికప్పుడు రాజకీయాలకు రోజా గుడ్ బై చెప్పే అవకాశం లేదని తెలుస్తోంది. బుల్లితెరపై కనిపిస్తూ పార్ట్ టైం పాలిటిక్స్ చేయనున్నట్లు కనిపిస్తోంది. అయితే , ఆమె సడెన్ గా రాజకీయాలను వదిలేసి టర్న్ కావడం వెనక ఏం జరిగి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలపై కూటమి సర్కార్ దృష్టిసారించింది. ఆడుదాం ఆంధ్రలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అంతర్గతంగా విచారణ జరుగుతోందని, దీంతో ఓ మంత్రితో ఆమె చర్చలు జరిపారని ప్రచారం జరిగింది.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే రోజా బుల్లితెరపై ఫోకస్ పెట్టారని, కొంతకాలం పార్ట్ టైం పాలిటిక్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.