తిరుపతిలో ఇటీవల ఓ నిరసన కార్యక్రమంలో మాట్లాడిన మాజీ మంత్రి రోజా రెచ్చిపోయారు. దమ్ముంటే అరెస్టు చేసుకో అని సవాల్ చేశారు. అయితే ఆమె పక్కన ఉన్న వైసీపీ నేతలు మాత్రం ఆ ఫోర్స్ చూపించలేకపోయారు. నంగి నంగిగా ఏదో మాట్లాడామని అనిపించారు. అందుకే రోజా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆమె చేసిన అవినీతిని బయటకు తీసి కేసులు పెట్టి ఉంటే ఆమె కూడా మూసుకుని ఉండేవారని కానీ పట్టించుకోకపోవడం వల్లనే ఇలా రెచ్చిపోతున్నారని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మండిపడుతున్నారు. కానీ రోజా అలా రెచ్చిపోవడం వెనుక మరో కారణం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
మహిళా నేతల్ని అరెస్టు చేయవద్దని చంద్రబాబు చెప్పారని .. ఆయనకు సంస్కారం ఉందని పేర్ని నాని ఇటీవల ప్రశంసించారు. ఈ విషయంపై ఆమెకు సమాచారం ఉందని అందుకే దాన్ని అలుసుగా చేసుకుని రెచ్చిపోతున్నారని అంటున్నారు. మహిళల్ని అరెస్టు చేసేంత ధైర్యం చంద్రబాబుకు లేదని రోజా భావిస్తున్నారు. తాను మహిళా నేతను కాబట్టి మరింత ఎక్కువగా రెచ్చగొట్టాలని అనుకుంటున్నారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ రాయల్ సహా ఎంతో మందిని అరెస్టు చేయించారు. టీడీపీ నేతల్ని కూడా అరెస్టు చేయించారు. వారంతా రోజా అరెస్టు కోసం ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో రోజా చాలెంజ్ చేస్తున్నారు. తనను అరెస్టు చేయలేరని అంటున్నారు, మరింతగా రెచ్చగొడుతున్నారు. అరెస్టు చేస్తే సానుభూతి వస్తుందని అనుకుంటున్నారో.. లేకపోతే అరెస్టు చేస్తారని తెలిసి ఇలా మాట్లాడితే ప్రభుత్వంపై పోరాడినందుకే అరెస్టు చేశారని ప్రచారం చేసుకోవడానికి పనికొస్తుందని అంటున్నారో కానీ రోజా తీరు మాత్రం టీడీపీ నేతల్లో చర్చనీయాంశమవుతోంది. ఆమెను అరెస్టు చేయకపోయినా రాజకీయంగా కనిపించకుండా చేయడమే తమ టార్గెట్ అని టీడీపీ నేతలు అంటున్నారు.