తిరుపతిలో ఒక్క అధికారి వల్ల జరిగిన దుర్ఘటనను అడ్డం పెట్టుకుని వైసీపీ చేస్తున్న శవ రాజకీయాన్ని చూస్తే.. టీడీపీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని సులువుగా అర్థమైపోతుంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటిపోయినా… ఐదేళ్ల పాటు చేసిన అరాచకాలు కళ్ల ముందు ఉన్నా ఎవరిపైనా చర్యలు తీసుకోవడడం లేదు. స్వయంగా రోజా టీటీడీలో టిక్కెట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆధారాలతో సహా విజిలెన్స్ నివేదిక రెడీ అయింది. మంత్రిగా ఆడుదాం ఆంధ్రాలో వందల కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇక మంత్రిగా ఆమె సంపాదన వందల కోట్లలోనే ఉందని విపక్ష నేతలు ఆరోపించారు.
అంతే కాదు.. జనసేన పార్టీ నేతల్ని కూడా ఆమె అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అరెస్టు చేయించారు. కిరణ్ రాయల్ ను ఓ సారి ఆమె అరెస్టు చేయించిన విధానంతో ఆయన ఖచ్చితంగా జైలుకు పంపిస్తానని సవాల్ చేశారు. ఐదేళ్ల పాటు రోజా.. టీడీపీ నేతల్ని, చంద్రబాబును, పవన్ ను ఎన్నెన్ని మాటలన్నారో అందరికీ తెలుసు. అయితే ఆమెపై కనీస చర్యలను గత ఏడు నెలలుగా తీసుకోలేదు. ఇప్పుడు సందు దొరికిందని ఆమె మీడియా ముందుకు వచ్చి తన టంగ్ పవర్ చూపిస్తున్నారు. పాత భాషను ప్రయోగిస్తున్నారు. వీరు ఇలా మాట్లాడటానికి కారణం టీడీపీ నేతల మంచితనమే అనుకోవచ్చు.
ప్రతిపక్ష నేతలు ప్రశ్నించవచ్చు. కానీ ఇలా బరి తెగించి చంద్రబాబు చేసిన హత్యాలంటూ మాట్లాడేందుకు వెనుకాడకపోవడం.. ఆస్పత్రిలో హంగామా చేసినా కేసులు పెట్టకపోవడం చూస్తూంటే.. ఇంకా వైసీపీ పాలన నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాగే కొనసాగితే…. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీలు కూడా తెరపైకి వస్తారు. అప్పుడు.. టీడీపీ మంచితనం చేతకాని తనం అవుతుంది. మరి మారుతారా ?