ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా హైదరాబాద్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మితో సమావేశం అయ్యారు. ఇటీవల వైసీపీలో జరిగిన పరిణామాలతో ఎవరూ విజయమ్మతో భేటీకి ఆసక్తి చూపించడం లేదు. కొత్త మంత్రులెవరూ ఆమె పేరును కూడా తల్చుకోలేదు. కొత్తగా మంత్రులైన వారు ఎవరూ విజయమ్మతో భేటీకి ప్రయత్నించలేదు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు అని గుర్తుంచుకోలేదు. కానీ రోజా మాత్రం ప్రత్యేకంగా గుర్తుంచుకుని మరీ హైదరాబాద్ వెళ్లి సమావేశం అయ్యారు. ఈ అంశం వైఎస్ఆర్సీపీలోనూ హాట్ టాపిక్ అవుతోంది.
హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉన్న షర్మిల నివాసంలో ఈ సమావేశం జరిగింది. తనకు మంత్రి పదవి లభించిన సందర్భంగా విజయమ్మ ఆశీస్సులు తీసుకోవాలని కొంత కాలంగా రోజా ప్రయత్నిస్తున్నారని ఇప్పటికి కుదిరిందని రోజా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి ప్రత్యేక రాజకీయ విశేషం ఏమీ లేదంటున్నారు. ఇటీవలి కాలంలో వైఎస్ విజయలక్ష్మి హైదరాబాద్, బెంగళూరుల్లోనే ఎక్కువగా ఉంటున్నారు.
విజయమ్మతో రోజా భేటీ దాదాపుగా గంట పాటు సాగినట్లుగా తెలుస్తోంది. వీరి మధ్య రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు తెలంగాణలో షర్మిల పాదయాత్రకు వస్తున్న స్పందనరపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. రోజా తాను విజయమ్మతో భేటీకి వెళ్తున్నానని జగన్కు చెప్పి ఉండరని.. అలా చెప్పినట్లయితే ఆయన వద్దనే వారని అంటున్నారు. అందుకే ఎవరూ కలవలేదంటున్నారు. ఇప్పుడు జగన్ అనుమతి లేకుండా రోజా కలిసి ఉన్నట్లయితే… అది భవిష్యత్లో రోజాకు సమస్యలు సృష్టిస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.