మోదీకి నలభై శాతం ఓట్లొచ్చాయి.. ప్రధాని అయ్యారు. రేవంత్ రెడ్డికి కూడా నలభై శాతం ఓట్లొచ్చాయి.. ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అదే నలభై శాతం ఓట్లు వచ్చిన జగన్ రెడ్డికి పదకొండు సీట్లే ఎందుకు ? .. అని మాజీ మంత్రి రోజా మథనపడ్డారు. రోజా ఇంత వరకూ చెప్పినా.. అంతర్గతంగా ఆమె ఆలోచనలు వేరే ఉన్నాయి. జగన్ రెడ్డి చెబుతున్న ఈవీఎం అనుమానాలే ఆమె మనసులో ఉన్నాయని అనుకోవచ్చు.
అయితే రోజాకు అర్థమయిందో లేదో కానీ.. జగన్ రెడ్డిని కొనసాగించాలా వద్దా అన్న ఏకైక ఎజెండాగా ఎన్నికలు జరిగాయి. అందరూ ఏకమయ్యారు. ఏకమయ్యే విధంగా జగన్ రెడ్డే చేశారు. తప్పనిసరిగా కలసి పోటీ చేయకపోతే.. రాష్ట్రం నాశనమైపోతుంది.. జగన్ మరోసారి గెలిస్తే.. అరాచకం రాజ్యమేలుతుందని అందరూ ఏకమైపోయారు. కలసికట్టుగా ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా పోరాడారు. అందుకే జగన్ కు నలభై శాతం ఓట్లు వచ్చినా.. పదకొండు సీట్లే వచ్చాయి.
జాతీయ స్థాయిలో బీజేపీకి నలభై శాతం ఓట్లే వచ్చినా వివిధ పార్టీల మధ్య చీలిపోయాయి.. తెలంగాణలో ముక్కోణపు పోటీ జరిగింది. రోజాకు ఇవన్నీ తెలియక అంటున్నారో.. లేకపోతే ఈవీఎంపై అనుమానాలు పెంచాలని అంటున్నారో కానీ.. ఆమె తెలివి తేటలపై మాత్రం వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యంగా చూసే పరిస్థితి వచ్చింది.