మాజీ మంత్రి రోజా తనను అరెస్ట్ చేయాలని చెప్పకనే చెప్పారు. టీటీడీ గోశాల ఇష్యూపై స్పందిస్తు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాళ్లను శిక్షించే ఉద్దేశం టీడీపీకి లేదని రోజా చేసిన వ్యాఖ్యలు ఆమె అరెస్ట్ ను కోరుతున్నట్లు ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడిన నేతలందరిని అరెస్ట్ చేస్తారని కూటమి అధికారంలోకి వచ్చాక జోరుగా ప్రచారం జరిగింది. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో నిధుల గోల్ మాల్ లో రోజాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి గత ప్రభుత్వం 119.19కోట్లు కేటాయించింది. 50కోట్లతో మొదలుపెట్టి అమాంతంగా దానిని 119కోట్లకు పెంచి దోచుకుందాం ఆట మొదలు పెట్టారు. స్పోర్ట్స్ కిట్ల కొనుగోలు ప్రక్రియను ఆర్అండ్బీకి అప్పగించారు. కిట్ల కోసం 38.55 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పినా, అందులో దోచేసిందే అధికం. క్రీడాకారులకు ఏమాత్రం నాణ్యతలేని కిట్లు సరఫరా చేశారు. యాప్లు, ప్రచార నిర్వహణ పనులను అనుచరులకు అప్పగించి దాదాపు 2 కోట్లు వారి జేబులో పెట్టారు. 34.20 కోట్లతో టీ -షర్టులు కొనుగోలు చేసి, వాటిపై వైసీపీ జెండా రంగులు, జగన్ బొమ్మలు ముద్రించారు.క్రీడాకారుల తరలింపుకు 76 లక్షలు…ఇలా దోచుకునేందుకు భారీగా నిధుల పెంపు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధుల గోల్ మాల్ పై విచారణ జరుగుతోందని అసెంబ్లీలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఎప్పుడో చెప్పారు.
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం.. అవినీతి సొమ్ములో రోజాకు కూడా వాటా ఉందని, త్వరలోనే ఆమెకు నోటీసులు ఇస్తారని ప్రచారం జరిగింది. విచారణ కూడా ప్రారంభం అవుతుందని అనుకున్నారు. కానీ, ఎలాంటి ముందడుగు పడకపోవడంతో రోజా తనకు వచ్చిన ప్రమాదం లేదని అనుకుంటున్నట్టు ఉన్నారు. అందుకే ఆమె ప్రభుత్వాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడారు. తప్పు చేసిన వాళ్లను శిక్షించే ఉద్దేశం టీడీపీకి లేదని అనడం, రోజా తన అవినీతిని అంగీకరించడమేననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చట్టప్రకారం ముందుకు వెళ్లడం కూడా వైసీపీ నేతలకు చేతకాని తనంగా కనిపిస్తోంది. సో, వాళ్లకు ఇకనైనా కూటమి ప్రభుత్వం ఎలా సమాధానం చెబుతుందో చూడాలి..