తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. జగన్ ముందస్తుకు వెళ్లడం ఖాయమని ఏ మాత్రం చాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంలో మొత్తంగా బరిలోకి దిగారు. మహానాడుతో దాన్ని పీక్స్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ లాంటి అప్రకటిత సలహాదారులు తమ “కామెంట్ల” ద్వారా మరోసారి బయటకు వస్తున్నారు. చంద్రబాబు మారాలంటూ ఆయన కొత్తపలుకులో నినదించారు. ఒకప్పుడు చంద్రబాబును ఇలాంటి సలహాదారులంతా మీరు మారాలి.. మీరు మారాలి అంటూ.. చెప్పి.. చివరికి నేను మారాను అని చంద్రబాబుతో చెప్పించారు.
చంద్రబాబు మొహమాటానికి టిక్కెట్లిస్తారని.. ఈ సారి దాన్ని వదిలించుకోవాలని ఆర్కే చెప్పుకొచ్చారు. అంతే కాదు ఈ సారి సీనియర్లకు కాదని.. యువతను నలభై శాతం ఇస్తామని చంద్రబాబు అన్నారని.. కానీ మరింత పెంచాలని యాభై శాతం ఇవ్వాలని ఆర్కే సలహా ఇస్తున్నారు. ఇలాంటి మార్పులతో ఆయన చంద్రబాబుకు తన కొత్త పలుకు ద్వారా బాగానే సలహాలిచ్చారు. చంద్రబాబుకే కాదు లోకేష్‌కు కూడా ఇచ్చారు. పాదయాత్ర లాంటి కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి వెళ్లాలని ఆయనకూ ఓ సలహా ఇచ్చారు.
అదే సమయంలో కొంత మంది పార్టీ నాయకులు దారుణంగా వ్యవహరిస్తున్నారని.. ప్రజల్లో ఉండే పార్టీ నాయకులు కొంత మందికి గౌరవం లభించడం లేదని.. ఇలాంటితప్పులను సరి చేసుకోవాలని ఆర్కే చెప్పుకొచ్చారు. విచిత్రం ఏమిటంటే. .. చంద్రబాబు చుట్టూకోటరీ ఇప్పటికీ నడుస్తోందని.. సమాచారం అంతా యథాతథంగా ఆయనకు చేరడంలేదని.. అలా చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆర్కే సూచించారు. నిజానికి గత ఎన్నికల్లో చంద్రబాబును. టీడీపీని ముంచిన కోటరీలో ఆర్కే కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ కోటరీలో ఆర్కే లేరేమో కానీ… కోటరీని కాదని.. తనకు సమాచారం చేరవేసే వ్యవస్థను చంద్రబాబు ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు.
మొత్తంగా తెలుగుదేశం పార్టీ లో మహానాడునింపిన జోష్ ఆర్కేలో కనిపించింది. ఇప్పటికే వైసీపీపై యుద్ధం ప్రారంభమయిందన్నారు కాబట్టి… ఆ యుద్ధంలో తన వంతు సాయంగా కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. వాటిని పాటిస్తారా లేదా అన్నది చంద్రబాబు ఇష్టం. తర్వాత ఎప్పుడైనా.. తాను ముందే చెప్పానని చెప్పుకోవడానికి ఈ ఆర్టికల్ బాగా పనికి వస్తుంది.