తెలంగాణలో ఏడాదికే రాజకీయాలు హీటెక్కిపోవడం ఎన్నికలు రేపే అన్నట్లుగా పోటీ పడుతూండటం ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను కూడా ఆశ్చర్య పరిచినట్లుగా ఉంది. అందుకే ఈ వారం తెలంగాణలోని రెండు ప్రధాన పార్టీలకు పరిస్థితి గుర్తు చేసి సలహాల ఇవ్వడానికే ఎక్కువ సమయం కేటాయించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోంది. సంబరాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దూకుడు ద్వారా చిటికెలో అన్ని పనులు చేయగలనని అనుకుని మొదటికే మోసం తెచ్చుకుంటున్నారని ఆర్కే విశ్లేషించారు. ముఖ్యమంత్రిగా ఉన్న వారు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సలహాలిచ్చారు. ఇప్పటికైతే ప్రభుత్వంపై ప్రజల్లో కొంచెం అసంతృప్తి కనిపిస్తోంది కానీ అది వ్యతిరేకత కాదని ఆర్కే తేల్చేశారు. రేవంత్ కాస్త మారితే మళ్లీ పాజిటివ్ వచ్చేస్తుందన్నట్లుగా ఆయన తేల్చేశారు.
ఇక బీఆర్ఎస్ తాము అధికారంలోకి వచ్చేసినట్లే అనుకుంటున్నారు కానీ రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లోఉన్న కించిత్ అసంతృప్తి బీఆర్ఎస్కు ప్లస్ అయ్యే అవకాశాలే కనిపిచడం లేదని అంటున్నారు. వారు చేసిన నిర్వాకాలు కళ్ల ముందే ఉన్నాయని ప్రజలు మర్చిపోలేదని అంటున్నారు. అప్పుడే ఏదో అయిపోయిందన్నట్లుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు కానీ.. ప్రజల కోణంలో మాత్రం ఆలోచించడం లేదంటున్నారు. మొత్తంగా రెండు పార్టీలు.. ఎన్నికలకు ఇంకో నాలుగేళ్ల సమయం ఉందని గుర్తుంచుకుని వ్యూహాత్మక రాజకీయాలు చేయాలని సలహా ఇచ్చారు.
ఇక ఏపీ విషయంలో జగన్ రెడ్డిపై ప్రజలే దావా వేయాలని సలహాలిచ్చారు.అదానీ ఒప్పందంలో జగన్ రెడ్డి కేంద్రం చాటున దాక్కున్నారని ఆయన తప్పించుకునే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ప్రజలే ఇన్వాల్వ్ కావాలని అంటున్నారు. ఆయన పిలుపు విని ఎవరైనా ఏపీ కోర్టుల్లో దావాలు వేస్తారేమో ?