ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతపు ఆర్టికల్ ” కొత్తపలుకు” లో పైకి కనిపించే భావం కన్నా అంతర్గతంగా మరో సందేశం ఉంటుందని… హిడెన్ అజెండా ఉంటుందని చాలా మంది రాజకీయ నాయకులు భావిస్తూంటారు. రాజకీయాలను లోతుగా పరిశీలించేవారు ఆ ఆర్టికల్‌ను చదువుతూంటే అందులో రాసిన దాని కన్నా ఇంకేదో అర్థం వారికి ఉందని అనిపిస్తూ ఉంటుంది. అది నిజమో కాదో అంచనా వేయలేని పరిస్థితి. ఈ వారం అలాంటి ఆర్టికల్‌ను మరోసారి ప్రజల ముందు ఉంచారు ఆర్కే. ఈ ” కొత్తపలుకు” సారాంశం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలను తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓన్ చేసుకోరు.. ఏపీలో అయితే లక్ష్యం వైపు వెళ్లొచ్చు అనేదే. నేరుగా ఎక్కడా చెప్పలేదు కానీ టార్గెట్‌గా పెట్టుకున్న వారికి చేరేలా స్పష్టంగానే చెప్పారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీకి మద్దతు కోసం వైఎస్ సానుభూతినే నమ్ముకున్నారు. కానీ అనుకున్నంతగా సక్సెస్ కావడం లేదు. ఈ క్రమంలో రాజకీయ నేతలందర్నీ కూడగట్టడానికి ఆత్మీయ సమావేశం పెట్టారు. కానీ ప్రయోజనం లేకపోయిందని ఆర్కే తేల్చారు. క్రియాశీలకంగా ఉన్న ఎవరూ రాకపోగా వచ్చిన వారి వల్ల తెలంగాణలో పార్టీకి ప్రయోజనం ఏమీ ఉండదని తేల్చేశారు. అసలు ఇలాంటి సమావేశమే తప్పని .. తెలంగాణ ప్రజలకు ఏపీ వంటి మూర్ఖులు కాదన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉన్నా.. ఆమె ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న సమాచారం కూడా ఇచ్చారు.
జగన్ కేసుల్లో ఎప్పుడు ఎలా విచారణ జరుగుతుందో ముఖ్యంగా ఈడీ కేసుల్లో ఏం జరుగుతుందో ఆర్కే జోస్యం చెబుతున్నారు. వచ్చే ఏడాది జూన్‌కు ఈడీ కేసులు తేలిపోతాయని ఈ విషయం జగన్‌కు కూడా తెలుసు కాబట్టే ప్రత్యామ్నాయంగా తన భార్య భారతిరెడ్డిని సిద్ధం చేసి ఉంచారని అంటున్నారు. కానీ భారతి రెడ్డిని సీఎం చేయడం షర్మిలకు.. విజయమ్మలకూ ఇష్టం లేదని .. అందుకే మధ్యే మార్గంగా విజయమ్మను సీఎంను చేస్తే షర్మిల పైచేయి సాధించినట్లేనని ఆర్కే రాసుకొచ్చారు. ఇక్క ఆర్కే జగన్‌కు శిక్ష గురించే రాసుకొచ్చారు. బెయిల్ రద్దు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంటే బెయిల్ రద్దు కాదని ఆయన కూడా నమ్ముతున్నారనే అనుకోవాలి. మొత్తంగా ఈ ఆర్టికల్ మొత్తం మీద షర్మిలకు వెళ్లిన సందేశం చాలా క్లియర్‌గా ఉంది. తెలంగాణలో కనీస ఓటు బ్యాంక్ కూడా రాదు. ఏపీలో అయితే ఆ అవకాశం ఉంది. రాజకీయాల్లో దిగిన తర్వాత ఇక ఎవర్నీ పట్టించుకోకూడదు. వెళ్లి ఏపీలో రాజకీయాలు చేసుకోమని పరోక్షమైన సలహాను ఆర్కే పంపారు.
జగన్ విషయంలో బీజేపీ ఎలా వ్యవహరించబోతోందో మూడు నెలల్లో తేలిపోతుందని ఆర్కే చెబుతున్నారు. రెండున్నరేళ్లు పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అంచనా వేసుకుని బీజేపీ హైకమాండ్ దానికి తగ్గట్లుగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుందని. ఏ మాత్రంజగన్ వెనుకబడ్డారని అంచనా వేసుకున్నా తమ పని తాము ప్రారంభిస్తారని తమిళనాడు రాజకీయాల్ని ప్రస్తావించారు. మొత్తంగా ఆర్కే కొత్తపలుకులో ఈ వారం రాసిన దాని కన్నా పరోక్షమైన సందేశమే ఎక్కువగా కనిపిస్తోంది.