ఆంధ్రజ్యోంతి ఎండీ వేమూరి రాధాకృష్ణ జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని ఇప్పుడే తెలుసుకున్నారు. బోలెడంత ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ ను కూడా ఒక వర్గానికే పరిమితం చేసి ఆయన సామాజికవర్గంపై ఇతర వర్గాల్లో వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని గగ్గోలు పెట్టారు. ప్రతీ వారం ఆయన తన పత్రికలో రాసే కొత్తపలుకులో ఈ వారం .. మొత్తం జగన్ కుల రాజకీయాలు ఎలా చేస్తున్నారన్నదానిపైనే చర్చించారు. కానీ అందులో కొత్త విషయాలేం లేవు. అందరికీ తెలిసినవే. కళ్ల ముందున్నవే. కానీ ఆయన ఇలా చేస్తున్నారని గగ్గోలు పెట్టడమే కొత్తపలుకులో ఉంది.
జగన్ ను తక్కువ అంచనా వేసి.. ఆయన కుల రాజకీయాలు ప్రభావం చూపవు అని .. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకూ నమ్మకం కలిగించేలా చేసింది ఆంధ్రజ్యోతి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి చూసి ఓట్లేస్తారని సర్వేలతో నమ్మకం కలిగించారు. కానీ చాపకింద నీరులా జగన్ చేసిన కుల రాజకీయం … ఇతర ప్రచారాల గురించి మాత్రం సీరియస్గా తీసుకోలేదు. చివరికి దారుణ పరాజయం ఎదురవ్వాల్సి వచ్చింది. అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చే దాకా ఈ కుల రాజకీయాలు జగన్ చేస్తున్నారని గుర్తించనట్లుగా ఆర్కే రాసుకొచ్చారు.
పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ చేస్తున్నవే కుల రాజకీయాలు. ఆ విషయం అందరికీ తెలుసు. దానికి కౌంటర్ ఇవ్వాల్సిన టీడీపీ.. సైలెంట్ గా ఉంది. జగన్ కు సంబంధం లేకుండా వేరే వ్యూహాలు అమలు చేసింది. అందులో ఆర్కే కూడా భాగస్వామేనని టీడీపీ వర్గాలు గుసగుసలాడుతూ ఉంటాయి. ఆయన టీడీపీకి మేలు చేస్తున్నారా.. కీడు చేస్తున్నారా అనేది చెప్పలేకున్నామని బాధపడే క్యాడర్ ఎక్కువ మంది ఉంటారు . ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ను అడ్డ పెట్టుకుని ఓ సామాజికవర్గంపై జగన్ విషం చిమ్ముతున్నారని అంటున్నారు.
అయితే ఇక్కడ ఆర్కే వాదనలో లాజిక్ లేదు. ఎన్టీఆర్ ను అడ్డంపెట్టుకుని ఓ సామాజికవర్గంపై ద్వేషం పెంచాలనుకుంటే నేరుగా ఎన్టీఆర్ను తిట్టేవారు. ఇప్పుడు కులాల మధ్య మరింత చర్చ జరిగేది. కానీ గౌరవం అని చెబుతున్నారంటే ఇతర వర్గాలలోనూ వ్యతిరేకత వస్తుందని జగన్ అనుకుటున్నారు. అందుకే పైకి గౌరవం అని చెబుతున్నారు. అది గుర్తించినప్పుడు ఎందుకు ఎన్టీఆర్ పేరును కులం కోణంలో చూస్తారన్నది ఆర్కే ఆలోచించలేకపోయారు. ఎన్టీఆర్ పేరు తీసేసింది జగన్ కు ఉన్న ఓ రకమైన మెంటాలిటీ వల్ల కావొచ్చు కానీ.. కులద్వేషంతో కాదనే సంగతిని గుర్తించలేకపోతున్నారు.
జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారు. కుల రాజకీయాలే చేస్తున్నారు. అందులో డౌట్ లేదు. కానీ దానికి విరుగుడేందో ఆర్కే చెప్పాలి కానీ.. ఇలా గగ్గోలు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదనేది ఎక్కువ మంది అభిప్రాయం.