ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి ఉండే నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. నారా లోకేష్ అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడమే దీనికి కారణం. గత ఎన్నికల్లో పరిస్థితి బాగోలేదని సర్వేల్లో తేలినా అక్కడి నుంచే పోటీ చేసిన లోకేష్.. చివరికి ఐదు వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అక్కడ జనసేన మద్దతుతో పోటీ చేసిన సీపీఐ అభ్యర్థిగా పదివేల ఓట్లు వచ్చాయి. అక్కడ ముందు నుంచీ కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. టీడీపీ అక్కడ పోటీ చేసిందే తక్కువ. పొత్తులు పెట్టుకున్నప్పుడు మిత్రపక్షాలకే ఇచ్చేసింది. ఆ ఎఫెక్ట్ లోకేష్ పోటీ చేసినప్పుడు గట్టిగానే పడింది. అయితే లోకేష్.. ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించి.. ఓ నియోజకవర్గ ఇంచార్జిగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో అన్నీ చేపడుతున్నారు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. నిజానికి మొదటి సారి పన్నెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తేడాతో గెలిచిన ఆయన తర్వాత లోకేష్‌పై కుల సమీకరణాల్లో పోలరైజ్ కావడంతో ఐదు వేల ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నారు. మామూలుగా అయితే ఆర్కే క్యాడర్‌కు అందుబాటులో ఉంటారు. లోకేష్‌పై పోటీ చేసినప్పుడు టీడీపీ మళ్లీ గెలిస్తే కరకట్టపై ఉన్న పేదంలదర్నీ ఖాళీ చేయిస్తారని.. హైవే పక్కన ఉన్న ఇళ్లన్నింటినీ కూలగొట్టించేస్తారని ప్రచారం చేశారు. పేదల్లో ఓ భయం కల్పించారు. అవన్నీ ప్లస్ పాయింట్లుగా మారాయి.
గత మూడేళ్లుగా ఆర్కే ప్రజల్లో తిరిగింది కూడా లేదు. పైగా ఆయన ఎవరి ఇళ్లు అయితే టీడీపీ వస్తే కూలగొట్టేస్తారని చెప్పారో ఆ ఇళ్లతో పాటు ఇతర వాటినీ తొలగించేశారు. చాలా మంది రోడ్డున పడ్డారు. వారికి సెంట్ స్థలం ఇళ్లు చూపించారు. కానీ అవి అక్కడ లేవు. దీంతో విజయవాడకు .. గుంటూరుకు.. అలా చెల్లాచెదురైపోయారు. ఇక గ్రామాల్లో ఎక్కడా అభివృద్ధి పనుల్లేవు. సమస్యలు పరిష్కరిస్తోంది కూడా తక్కువే. దీంతో సహజంగానే ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. మరో వైపు అధికారం వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల తీరు మారిపోయింది. ఎక్కడిక్కడ పెత్తనం చేస్తూ ప్రజల్ని భయభ్రాంతాలకు గురి చేయడం.. ప్రైవేటు పంచాయీతల్లో తలదూర్చడం చేయడంతో వైసీపీ చోటా నేతలపైనా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది.
పరిస్థితి అనుకున్నట్లుగా లేకపోవడంతో ఆర్కే కూడా తన సీటును ఈ సారి బీసీలకు ఇచ్చేస్తానని ప్రకటిస్తున్నారు. సీఎం జగన్ ఈ సారి యాభై శాతం అసెంబ్లీ టిక్కెట్లు బీసీలకు ఇస్తానని చెబుతున్నారు. ఆ కోటాలో త్యాగం చేయడానికి ఆర్కే రెడీ అయిపోయారని అంటున్నారు. మరో వైపు లోకేష్ వ్యూహాత్మకంగా గ్రామాల వారీగా పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా టీంను నియమించుకుని మానిటర్ చేస్తున్నారు. అక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వెళ్లిపోతున్నారు. గతంలో సీఎం కుమారుడిగా.. మంత్రిగా ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉండేది.. జనం వెళ్లలేకపోయేవారు. దీంతో ఆయన గెలిచినా తాము కలవలేమని ఎక్కువగా భావించేవారు. అలాంటి పరిస్థితిని లోకేష్ లేకుండా చూసుకుంటున్నారు.