ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించారు. వివేకా హత్య రోజు జగన్ ఇంట్లో ఏం జరిగిందో చెప్పారు. ఆయన నలుగురి గురించి కూడా చెప్పారు. ఆ నలుగురు పేర్లు కూడా చెప్పారు. ఇది సంచలనం అయింది. కానీ ఇప్పటి వరకూ ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ అంశంపై వైసీపీ నుంచి స్పందించలేదు. మామూలుగా ఇలాంటివి చెప్పినప్పుడు బెడ్ రూంలో ఉన్నారా.. కిటీకీలో నుంచి చూశారా అంటూ సెటైర్లు వేసేవాళ్లు వైసీపీ నేతలు. ఈ సారి అది కూడా చేయలేదు. తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు.
ఆర్కే చెప్పిన ఆ నలుగురిలో ఒకరిని ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది. ఆయన ఏం చెప్పారో తెలియదు. కానీ జగన్ , భారతిలకు ఫోన్ చేసిన విషయం మాత్రం అవినాష్ రెడ్డి ఒప్పుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒప్పుకున్నారు. పీఏల వద్ద ఉండే ఫోన్లు జగన్ , భారతీలే మాట్లాడతారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు .. ఆ ఫోన్ల చుట్టూనే కథ నడుస్తోందని ఆర్కే చెబుతున్నారు. అది కూడా తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు అన్న స్పష్టత ఇవ్వడమే ఇందులో అసలు కోణం. ఓ అదృశ్య శక్తి జగన్ , అవినాష్‌లను కాపాడుతోందని ఆయన అంటున్నారు.
మరో వైపు అవినాష్ రెడ్డి.. ఎప్పుడు సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారోననని ఎప్పుడూ లేని విధంగా జనంలోనే ఉంటున్నారు. ఆయన ఉదయమే గడప గడపకూ అని వెళ్తున్నారు. సాయంత్రం వరకూ కార్యకర్తలతోనే ఉంటున్నారు. ఇంట్లో కూడా ఉండటం లేదు. రాత్రి పొద్దు పోయాక ఇంటికి వెళ్తున్నారు. మళ్లీ పొద్దున్నే జనంలోకి వెళ్తున్నారు. ఆయన ఎంపీ అనే మాటే కానీ.. ఇప్పటి వరకూ ఇలాంటి పార్టీ కార్యక్రమాలు చేసింది తక్కువే. కానీ ఇప్పుడు అరెస్ట్ భయంతో జనంలోనే ఉంటున్నారు.
సీబీఐ అధికారులు పులివెందులలో ఉన్నారో లేదో తెలియదు కానీ రెండు బృందాలు ఉన్నాయని అవినాష్ రెడ్డిని అనుసరిస్తున్నాయన్న ప్రచారం మాత్రం ఉద్దృతంగా సాగుతోంది. దీంతో అవినాష్ రెడ్డికి టెన్షన్ తప్పడం లేదు. ఒక్క సారే అరెస్ట్ చేస్తే పోతుందని ఈ.. మానసిక వేదన … తట్టుకోలేకపోతున్నామన్న ఆవేదన ఆయన వర్గీయుల్లో కనిపిస్తోంది.