ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజులుగా అసహనంగా ఉన్నారు. ఆయనతో పాటు రామోజీరావు, టీవీ5 చానల్‌పైనా జగన్ ఎంత కోపంగా ఉన్నారో.. ప్రతీ సందర్భంలోనూ వెల్లడవుతూనే ఉంది. జగన్‌ను వీరు ఏ మాత్రం లెక్క చేయక.. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే వీరిలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణది ఓ భిన్నమైన స్టయిల్. ఆయన ప్రభుత్వాన్ని.. జగన్ పాలనను.. తప్పు పట్టలేకుండా ఎదురుదాడి చేయడమే కాదు.. అంతకు మించి ఆయన కుటుంబంలోని గొడవల్ని కూడా ప్రజల ముందు ఉంచుతున్నారు. ఈ వారం కూడా అలాంటి ఓ విశేషాన్ని ప్రజల ముందు ఉంచారు. అదేమిటంటే… సీఎం జగన్ పార్టీకి ఆయన తల్లి విజయలక్ష్మి గుడ్ బై చెప్పబోతున్నారట.
ఇప్పటికే కుమార్తె షర్మిల ప్రారంభించిన వైఎస్ఆర్టీపీ కోసం… బ్రదర్ అనిల్ ప్రారంభించబోయే క్రైస్తవ పార్టీ కోసం విజయమ్మ తన ఆలోచనలు పంచుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గౌరవాధ్యక్షురాలిగా వైదొలగాలని అనుకుంటున్నానని ఆమె తన నిర్ణయాన్ని నేరుగా జగన్‌కే చెప్పారని ఆర్కే అంటున్నారు. రాజీనామా చేస్తే పరువు పోతుందని ప్లీనరీ వరకూ ఆగాలని జగన్ కోరారట. నిజానికి విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేసిన వైసీపీకి ఏం నష్టం ఉండదు. కానీ జగన్ ఇమేజ్‌కే నష్టం వస్తుంది. తల్లి కూడా సంబంధం తెంచుకుందన్న .. ఆయన మనస్థత్వం ఏమిటనేది అక్కడే తేలిపోతుందని చెప్పుకోవడం ప్రారంభిస్తారు. ఈ కారణంగా జగన్ గడువు అడిగినట్లుగా ఆర్కే పరోక్షంగా చెప్పుకొచ్చారు.
జగన్ కుటుంబంలో ఏం జరుగుతుందో ఇటీవలి కాలంలో పూసగుచ్చినట్లుగా ఆర్కే చెబుతున్నారు. ఆయనకు జగన్ కుటుంబం నుంచే సమాచారం అందుతోంది. ఆర్కే చెబుతున్నవి తప్పు అని.. కల్పితాలని ఎవరూ అనడం లేదు. ఖండించడం లేదు. గతంలో ఇలాంటి వార్తలు వస్తే విజయమ్మ పేరు మీద ఓ ఖండన వచ్చింది. కానీ ఆ ఖండనపై ఆమె సంతకం లేదు. బహిరంగంగా మాట్లాడినప్పుడు అలాంటివి రాశారని విజయమ్మ ఆర్కేపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఆర్కే చెబుతున్నది నిజమని అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేయబోతున్నారని కూడా ఆర్కే ప్రకటించారు.
జగన్ ఫ్యామిలీ నిట్ట నిలువుగా చీలిపోయినట్లుగా కనిపిస్తోంది. ఓ ఫ్యామిలీ భాగం పూర్తిగా ఆర్కే సలహాల మీద ఆధారపడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం నిజమయితే.. జగన్ తన కుటుంబంతోనే పోరాడక తప్పదేమో. జగన్ మనస్తత్వం ఎంత దారుణంగా ఉంటుందో కుటుంబసభ్యులతో జగన్ వ్యవహరిస్తున్న తీరును ప్రజల ముందు పెట్టడం ద్వారా ఆర్కే వివరిస్తున్నారు. ఈ వారం కొత్త పలుకులో న్యాయస్థానాలపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు.. ఇతర అంశాలపై సుదీర్ఘంగా విశ్లేషించారు. అయితే విజయమ్మ రాజీనామాపై జరగబోయేది చెప్పడమే హైలెట్ అనుకోవాలి.