ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం తన ఆర్టికల్‌లో… మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఓటర్ల మైండ్‌సెట్‌ను మార్చే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. ఏపీకి జరుగుతున్న అన్యాయాలు.. ప్రజలు కూడా పట్టించుకోకపోవడం వంటి అంశాలపై చాలా వరకూ రాసినా చివరికి వచ్చే సరికి ఆయన … మున్సిపల్ ఎన్నికలను టార్గెట్ చేశారు. మిగతా వాటి సంగతేమో కానీ విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలు… అలాగే మహా విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు మాత్రమే… రాష్ట్ర భవిష్యత్‌ను మార్చబోతున్నాయని ఆయన అంటున్నారు.
ఈ మూడింటిలో వైసీపీకి ఓటేసి గెలిస్తే.. విజయవాడ, గుంటూరు ప్రజలు అమరావతిని రాజధానిగా వద్దంటున్నారన్న ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. అదే విశాఖకు వచ్చే సరికి మాత్రం.. వైసీపీ గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు విశాఖ ప్రజలు అంగీకరించినట్లు అవుతుందని ఆయన విశ్లేషించుకొచ్చారు. నిజానికి మున్సిపల్ ఎన్నికల ఎజెండా రాజధాని కానీ… స్టీల్ ఫ్యాక్టరీ కాని కాదు. అయితే… ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది అన్న సూచనలు రావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి రావాలి. పైగా ఏపీ సర్కార్ అధికారం చేపట్టి ఇంకా రెండేళ్లు కూడా నిండలేదు. ఇలాంటి సమయంలో… పార్టీల పరంగా జరిగే ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తే అది మైనస్ అవుతుంది. ఎందుకంటే … అధికార పార్టీకి ఎన్నో అడ్వాంటేజ్‌లు ఉంటాయి.
వైసీపీ నేతలు ఆ అడ్వాంటేజ్‌లను మరింత ఎక్కువగా పెంచుకున్నారు. ఇలాంటి సందర్భాల్లో వైసీపీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో అదే చేశామని చెబుతున్నారు. కానీ అవిపార్టీ రహితంగా జరుగుతాయి ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇప్పుడు.. ఈ సీన్లోకి ఆర్కే తన కొత్త పలుకుద్వారా రంగంలోకి దిగారు. వైసీపీకి ఎందుకు వ్యతిరేకంగా ఓటేయాలో… ప్రాంతాల వారీగా అజెండా దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. అమరావతికి అనుకూలమైతే.. గుంటూరు, విజయవాడల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయాలి.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అయితే వైజాగ్‌లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయాలి. ఆర్కే చెప్పిన విజయవాడ, గుంటూరు లాజిక్ ప్రకారం మరి అక్కడి ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తే.. తమ ప్రాంతానికి రాజధానిని వ్యతిరేకించుకున్నట్లు అవుతుంది కదా..! అలాంటివి ఆర్కే పట్టించుకోరు . తను రాయాలనుకున్న వాటిని రాసేస్తారు. అయితే ఆర్కే … చదివే వారిని నిజమే కదా అనిపించేలా శైలిని అనుసరించడమే కాస్త ట్విస్టింగ్‌గా ఉంటుంది.