ఎనిమిదవ క్లాస్ చదువుతున్న పిల్లాడు కారు బయటకు తీశాడు. డ్రైవర్ గా మారిపోయాడు. తన స్నేహితులను ఎక్కించుకున్నాడు. రయ్యిన పోతున్నాడు. అంతలో కారు అదుపుతప్పింది. పక్కనే ఉన్న ఫుట్ పాత్ ని ఢీకొట్టింది. ఫలితంగా ఆ పిల్లవాడు మరణించాడు. తోటి పిల్లలకు గాయాలయ్యాయి. ఇంకోచోట, తండ్రి ప్రోత్సాహంతో పిల్లవాడు మోటారు సైకిల్ తీసుకుని బయటకు వెళ్ళాడు. ఎదురుగా వస్తున్న లారీని ఎలా తప్పించుకోవాలో లైసెన్స్ లేని ఆ పిల్లవాడికి తెలియలేదు. అంతే, పసివాడి ప్రాణం పోయింది. ఇంట్లో అమ్మానాన్నకు చెప్పకుండా టీనేజ్ స్టూడెంట్ తెల్లవారుజామున కారుతీసి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డెక్కాడు. ఇంటికి వెనక్కి తిరిగి రాలేదు. ఇలా రోడ్డు ప్రమాదాలకు పిల్లలు మృత్యువాత పడుతూనే ఉన్నారు. మరి దీనికి బాధ్యులెవరు ?
నిర్లక్ష్యం, సురక్షితమైన డ్రైవింగ్ చేయలేకపోవడంతోపాటుగా పిల్లలే డ్రైవర్లుగా మారడం, లైసెన్స్ లేకుండా బండ్లు నడపటం వంటి కారణాలవల్ల ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలకు పిల్లలు (18ఏళ్ల లోపువారు) డ్రైవ్ చేయడం కూడా ముఖ్యమైన కారణాల్లో ఒకటిగా ఉంది. 2012 నుంచి 2014 వరకు (మూడేళ్లలో) రోడ్డు ప్రమాదాల లెక్కలు తీస్తే, అండర్ ఏజ్, లేదా లైసెన్స్ లు లేకుండా వాహనాలు నడపడంవల్ల జరిగిన ప్రమాదాలు అక్షరాలా లక్షా 62వేలు. ఇందులో పిల్లలు నడపడంవల్ల జరిగిన ప్రమాదాల సంఖ్య 60వేలుదాకా ఉంది.
రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర రవాణా, ప్రధాన రహదారుల శాఖ సహాయ మంత్రి రాథాకృష్ణన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
లైసెన్స్ లు లేకుండా వాహనాలు నడపరాదని తెలిసినా ఆ కఠినమైన నిబంధనను సైతం బేఖాతరంటూ చాలామంది వాహనాలు పోనిస్తున్నారు. ఇలాంటి వారివల్ల 2012 నుంచి 2014వరకు లక్షా పదివేలకు పైగానే ప్రమాదాలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి.
1988 నుంచి అమల్లోకి వచ్చిన మెటార్ వెహికల్స్ చట్టంలోని 180 సెక్షన్ ప్రకారం, పిల్లలకు లేదా లైసెన్స్ లేనివారికి వాహనాలు ఇచ్చి నడపమంటే, ఆ వాహనం ఓనర్ లేదా ఇన్ ఛార్జ్ గా ఉన్న వ్యక్తికి జైలు శిక్ష లేదా జరిమానా లేదా ఈ రెండు కలిపి విధించవచ్చు. అయినప్పటికీ పిల్లలకు, లైసెన్స్ లు లేనివారికి కూడా వాహనాలను అప్పగిస్తూనే ఉన్నారు. మోటారు వాహనాలను నడపడం ఒక ఆటగా భావించడం అలవాటైపోతోంది. పైగా దీనికి పెద్దల అండదండలు ఉంటున్నాయి. `మనకేమీకాదన్న’ అభిప్రాయం చాలా మందిలో కనబడుతోంది. ఈ నిర్లక్ష వైఖరి ఒక్కోసారి పెను ప్రమాదాలకు దారితీస్తోంది. సురక్షిత పద్ధతుల్లోనే మోటారు వాహనాలను నడపడం నేర్పించాలనీ, పర్మినెంట్ లైసెన్స్ వచ్చేవరకూ సుశిక్షితులు పక్కనే ఉంచుకునే లెర్నర్ వెహికల్ నడపాలన్న నిబంధనను సైతం పాటించడంలేదు. సెక్షన్ 181 ప్రకారం, 18ఏళ్ల లోపువారు వాహనాలు నడిపితే వారికి కూడా జైలుశిక్ష, జరిమనా లేదా ఆ రెండూ విధించేవీలుంది. చట్టం దారి చట్టానిది, మనదారి మనదే అన్నంతగా పెరిగిపోయింది నిర్లక్షం.
చట్టం 1988లో వచ్చినా ఇప్పటికీ లైసెన్స్ లు లేకుండా, 18ఏళ్ల లోపువారు వాహనాలు నడపటం తగ్గకపోవడమన్నది పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితిని సూచిస్తోంది. మోటారు వెహికల్ చట్టాన్ని మరింత కఠనతరంచేయడమూ, లైసెన్స్ లు ఇచ్చే ప్రక్రియలో చైతన్యం కలిగించడం అవసరం. వీటన్నింటికంటే ముఖ్యమైనది రోడ్ ట్రాన్స్ పోర్ట్, పోలీస్ విభాగాల్లో లంచగొండితనం పూర్తిగా నిర్మూలించగలగాలి. కంచెే చేనుమేస్తుంటే దూడలు గట్టున మేస్తాయా అన్నట్లుంది ఇప్పటి పరిస్థితి. ఎప్పుడో ఒక్కొక్కసారి చట్టసభల్లో ప్రమాదాల గురించి ఆందోళన చెందడం, ఆ తర్వాత ఈ సమస్యను అటకెక్కించడం మామూలైపోయింది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంలో చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. డబ్బులిస్తే ఏపనైనా అయిపోతుందన్న భావనను ప్రజలనుంచి దూరం చేయాలి. అప్పటివరకు రోడ్డు ప్రమాదాలకు అడ్డూఅదుపూ ఉండదు. అప్పుడప్పుడూ ఇలా బాధపడటం తప్ప.