తెలంగాణలో పలు చోట్ల రోడ్ల పనులు జరుగుతున్నాయి. అవి ఇప్పుడు ఆగిపోయాయి. ఆ పనుల దగ్గర కాంట్రాక్టర్లు కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిపై ప్రభుత్వం నిధులు ఇవ్వడం కాబట్టి అనివార్య పరిస్థితుల్లో ఆపేయాల్సి వచ్చిందని.. ప్రభుత్వం మళ్లీ నిధులు ఇస్తే.. పనులు ప్రారంభిస్తామని ఫ్లెక్సీల్లో రాసి పెడుతున్నారు. అసంపూర్తిగా ఉన్న పనుల వద్ద ప్రత్యేకంగా ప్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వతీరును వివరిస్తున్నారు. బిల్లులు చెల్లించని కారణంగా పనులు పూర్తిచేయలేక పోతున్నట్లు… ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ప్లెక్సీలను ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.
సాధారణంగా ఎక్కడైనా పనులు మధ్యలోనే నిలిచిపోతే… కాంట్రాక్టర్లను ప్రజలు తిట్టుకోవడం సహాజం. దీంతో పనులు ఆగిపోవడం తమ తప్పు కాదని చెప్పేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో సుమారు రూ. 6500 కోట్ల నిధులు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. నాన్ ప్లానింగ్ కింద రహదారులు, బ్రిడ్జీల మెయింటనెన్స్ నిధులు కొన్ని చోట్ల సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. అన్ని రకాల పనులకు సంబంధించి గత ఐదారు నెలలుగా బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ప్రీజింగ్ విధించింది. దీంతో అప్పులు చేసి పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహాత్యయత్నాలకు పాల్పడ్డారు. తమకు రావాల్సిన నిధుల కోసం అనేక సార్లు ప్రభుత్వ పెద్దలతో సంప్రదించినా స్పందన రాలేదు. ఐదారు నెలలుగా ప్రయత్నాలు చేసినా… ప్రభుత్వం వైపు నుంచి నిధులు విడుదల కాలేదు.
ప్రభుత్వం స్పందించకపోవంతో తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు సమావేశమయ్యారు. వినూత్నంగా నిరసన వ్యక్తం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ మేరకే గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న పనులు వద్ద ప్లెక్సీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీల ఏర్పాటుతో ప్రభుత్వం వైపు నుంచి కదలిక ప్రారంభమైంది. కాంట్రాక్టర్లను చర్చలకు పిలిచారు. కానీ ధనిక రాష్ట్రంలో.. ఈ తిప్పలేమిటన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. అందరూ అనుకుంటున్నట్లుగా.. తెలంగాణ సర్కారు ఆర్థికంగా దివాలాకు దగ్గరగా ఉన్నందునే… ముందస్తుకు వెళ్లిందా అన్న అనుమానాలు కూడా కాంట్రాక్టర్లలో వస్తున్నాయి.