రోడ్లు బాగా లేవు మహా ప్రభో.. రోడ్లు ఇలాగే ఉంటే.. జనం ఓట్లతో తంతారు అని వైసీపీ నేతలు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. పరీక్ష పోయిన ప్రతీ సారి.. అయితే మార్చి లేకపోతే సెప్టెంబర్ అనుకున్నట్లుగా సీఎం జగన్ కూడా వచ్చే మార్చి కల్లా అద్దాల్లాంటి రోడ్లు.. రివ్వుమంటూ దూసుకెళ్దాం అని కబుర్లు చెబుతూ ఉంటారు. నిజం ఏమిటంటే రోడ్లు వేయడానికి డబ్బుల్లేవు. రోడ్ల పేరుతో తీసుకున్న అప్పులు కూడా దారి మళ్లాయి. పెట్రోల్ , డీజిల్ పై వేస్తున్న ఒక్క రూపాయి సెస్ కూడా ఎక్కడికి పోతుందో తెలియదు. మరో సారి ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి.
దీంతో అన్ని రోడ్లు వేయలేకపోయినా కనీసం… నియోజకవర్గంలో ప్రజాగ్రహాన్ని తగ్గించే ఐదు రోడ్లు అయినా వేయాలని నిర్ణయించారు. ఇందు కోసం … జిల్లా అధికారులు లేదా ఎమ్మెల్యేల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఐ ప్యాక్ సిబ్బంది ఇచ్చే సిఫార్సుల మేరకు రోడ్లు వేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఆ రోడ్ల కన్నా.. ముఖ్యమైన రోడ్లు నియోజకవర్గంలో వేయాల్సి ఉందని… పార్టీ నేతలు.. ఇంజినీరింగ్ అధికారులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం లైట్ తీసుకుంటోంది. ఐ ప్యాక్ చెప్పిన రోడ్లకు మాత్రమే నిధులు విడుదల చేస్తామని వాటిని వేగంగా పూర్తి చేయాలని సలహాలిస్తోంది.
ప్రభుత్వ తీరుపై ఇంజినీరింగ్ అధికారులు మాత్రమే కాదు ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తికి గురవుతున్నారు. అసలు ఎమ్మెల్యే అంటే… దేనికీ పనికి రాకుండా పోయాడన్న భావనకు గురవుతున్నారు. అంతా ఐ ప్యాక్ కే ప్రాధాన్యం ఇస్తూంటే.. ఇక తామెందుకనన్న అసంతృప్తి వారిలో పెరిగిపోతోంది. అయితే చివరికి వారికి టిక్కెట్లు కూడా ఐ ప్యాక్ నివేదిక సరిగ్గా ఉంటేనే ఇస్తారు. అందుకే ఇప్పుడు వారు బయటపడటం లేదంటున్నారు.