దొంగతనాలు రకరకాలు ఇళ్లలో చొరబడి ఎత్తుకెళ్లడం… రోడ్లు మీదకెళ్తూంటే చైన్ స్నాచింగ్‌లతో పాటు రాజకీయ నేతలు చేసే స్కాంలు కూడా దొంగతనాల కేటగిరిలోకి వస్తాయి. అయితే ఇటీవలి కాలంలో ఎవరూ ఊహించని విచిత్రమైన దొంగతనాలు ఏపీలో జరుగుతున్నాయి. రోడ్లను కూడా ఎత్తుకెళ్తున్నరు. రోడ్లను దొంగతనం చేయడం ఏమిటి మహా ప్రభో అని అనుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. చేయాల్సింది చేసేస్తున్నారు.
అమరావతిలో మంచి క్వాలిటీతో రోడ్లను నిర్మించారు. ఇప్పుడుఆ రోడ్లను పక్కగా తవ్వుకుని తీసుకెళ్లిపోతున్నారు. చీకటి పడగానే చాలు జేసీబీలు ట్రాక్టర్లతో వచ్చేస్తున్నారు. రోడ్లను తవ్వుకుని గ్రావెల్ తీసుకెళ్లిపోతున్నారు. పైన ఉండే తారును తలొలగించి పక్కన పడేస్తున్నారు. గతంలో ఇలాగే జరిగింది.అయితే అప్పట్లో పోలీసులు విచారణ చేసి అది దొంగతనం కాదని.. పక్క గ్రామంలో రోడ్లు బాగోలేకపోతే.. అక్కడి నుంచి తీసుకెళ్లి వేసుకున్నారని స్పష్టత ఇచ్చారు. పోలీసులే అంత మాత్రం సపోర్ట్ చేస్తూంటే ఇక ఊరుకుంటారా ?
అయితే ఇటీవలి కాలంలో ఇది మరీ ఎక్కువైపోయింది. కిలోమటర్ల కొద్దీ రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. గ్రావెల్ ఇతర మెటీరియల్‌ను ఎత్తుకెళ్తున్నారు. ఇది పోలీసులకు.. స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా జరగదు. ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ఇతర స్థానిక వైసీపీ నేతలు ఈ రోడ్ల దోపిడీకి పాల్పడుతున్నారన్న అనుమానాలున్నాయి. కానీ ఈ రాష్ట్రంలో అలా రోడ్లను దొంగతనం చేయడం పెద్ద నేరం కాదు. కానీ ఎవరైనా వారిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాత్రం రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేంత నేరం అవుతుంది.