ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి … ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు పొంతన లేదన్న విమర్శలు.. ఆయన పదవి చేపట్టినప్పటి నుండి వస్తున్నాయి. అయితే.. విపక్షాలు కాబట్టి.. వాళ్లు విమర్శలు చేస్తూనే ఉంటారని అనుకుంటాం కానీ… ఈ తరహా ఆర్థిక నిర్వహణలో తలపండిపోయిన వారికి కూడా.. జగన్ తీరు.. ఆశ్చర్యకరంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ఆర్థిక మంత్రిగా పని చేసి.. అత్యధిక బడ్జెట్లు ప్రవేశ పెట్టిన రికార్డు ఉన్న… మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కూడా.. ఏపీ సర్కార్ ఆర్థిక నిర్వహణ పట్ల… ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన పుట్టినరోజు సంద్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో.. ఏపీ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ తీరుపై నర్మగర్భంగా మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి.. ఖర్చులు తగ్గించుకుని పొదుపుగా ప్రభుత్వాన్ని నడపడం నేర్చుకోవాల్సి ఉందనే అభిప్రాయాన్ని రోశయ్య వ్యక్తం చేశారు. అలాగైతే కొంత కాలం నడుస్తుంది లేకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయన్నారు. ఓవర్ డ్రాఫ్ట్ లేకుండా ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టమని… ముఖ్యమంత్రిగా ఉన్న వారే ఇలాంటివన్నీ చూసుకోవాల్సి ఉందన్నారు. “ప్రస్తుత ముఖ్యమంత్రి కేంద్రంతో సరిగా లేడు, రాష్ట్రంలో మిగతా ప్రతిపక్షాలతో కలవకుండా ఒంటరిపోతున్నాడని, అతని ఆలోచన ఏమిటో తెలియాలంటే కొంత క్లారిటి రావాల్సిన ఆవసరం ఉందని..” వ్యాఖ్యానించారు.
సుదీర్ఘ కాలం ఆర్థికమంత్రిగా పని చేసిన రోశయ్యకు మాత్రమే కాదు.. చాలా మందికి ఏపీ సర్కార్.. ఆర్థిక నిర్వహణ తీరు అర్థం కావడం లేదు. ఆదాయ పెంపు మార్గాలేమీ పెద్దగా లేకుండానే.. వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల పేరుతో.. నగదు బదిలీ చేయబోతున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో… ఈ సంక్షేమ పథకాల కోసమే… రూ. 40వేల కోట్లు అప్పు తేబోతున్నట్లుగా.. బడ్జెట్లో చూపించారు. ఇదంతా అనుత్పాదక వ్యయం అవుతుందని… భారం అవుతందన్న అభిప్రాయం .. చాలా మందిలో ఉంది. దీన్నే రోశయ్య.. తనదైన శైలిలో ఆవిష్కరించారు.