ఈవారం 4 సినిమాలు వస్తున్నాయి. వాటిలో 2 తెలుగు సినిమాలు. రెండు డబ్బింగ్ బొమ్మలు. పరభాషా చిత్రాలతో పెద్దగా సమస్య లేదు. కాకపోతే.. రెండు తెలుగు సినిమాలే తమతో తాము పోటీ పడుతున్నాయి. అందులో ఒకటి రాబిన్ హుడ్ అయితే, మరోటి మ్యాడ్.
ఇది లాంగ్ వీకెండ్. ఆదివారం సెలవు. సోమవారం రంజాన్. కాబట్టి హాలిడే కలిసొస్తుంది. అందుకే ఈవారం సినిమాలు వరుస కట్టాయి. నిజానికి రాబిన్ హుడ్ మిడ్ బడ్జెట్ సినిమా. దాంతో పోలిస్తే మ్యాడ్ చిన్న మూవీనే. రెండు సినిమాలకు బాక్సాఫీసు దగ్గర సరిపోయేన్ని ధియేటర్లు ఉంటాయి. కానీ ఇద్దరు నిర్మాతలు మాత్రం ఇది పోటీ అనుకొంటున్నాయి.
మైత్రీ మూవీస్, సితార మధ్య మంచి బాండింగ్ వుంది. ఇద్దరూ తమ సినిమాల విడుదల తేదీ ఖరారు చేసే సమయంలో కూర్చుని మాట్లాడుకొన్నారు కూడా. ఓ సినిమా వాయిదా పడితే బాగుంటుంది అనుకొన్నారు. కానీ కుదర్లేదు. కనీసం ఒక రోజు ఆగినా బాగుండేది. కానీ అదీ వీలు కాలేదు. మ్యాడ్ సినిమాని మార్చి 29న విడుదల చేద్దామనుకొన్నారు. కానీ 29 అమావస్య వచ్చింది. సెంటిమెంట్ పరంగా… ఒక రోజు ముందుకు తీసుకొచ్చేశారు. అటు మైత్రీ మూవీస్ కానీ, ఇటు నాగవంశీ కానీ.. మరో సినిమా పోటీకి రావడం ఇబ్బందికరమే అంటున్నారు. సోలో రిలీజ్ దొరకనందుకు బాధ పడుతున్నారు.
నైజాంలో ‘రాబిన్ హుడ్’కి సరైన థియేటర్లు దొరకలేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నైజాంలో ఎక్కువ థియేటర్లు దిల్ రాజు చేతిలో ఉన్నాయి. ఆయన ‘లూసీఫర్ 2’ని విడుదల చేస్తున్నారు. కాబట్టి వీలైనన్ని ఎక్కువ థియేటర్లు ఆ సినిమాకే వెళ్తాయి. ప్రతీ థియేటర్లోనూ సినిమా ఉండాల్సిందే అనే లెక్క రాబిన్ వుడ్, మ్యాడ్ సినిమాలకు లేదు. కాకపోతే ఇది ఐపీఎల్ సీజన్. అసలే క్రికెట్ మ్యాచ్లు సినిమాలకు పోటీలుగా నిలుస్తున్నాయి. అలాంటప్పుడు మరో సినిమా పోటీకి దిగితే కాంపిటీషన్ మరింత టఫ్ అవుతుంది. అందుకే మైత్రీ, సితార ఇంత ఇబ్బంది పడుతున్నాయి. మిడ్ రేంజ్ సినిమాల పరిస్థితే ఇలా ఉంటే, ఒకేసారి రెండు పెద్ద సినిమాలు విడుదల అయితే పరిస్థితి ఇంకెలా ఉంటుందో?